Share News

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:34 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 25 నుంచి 27వ తేది వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ నుంచి పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశించారు.

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 25 నుంచి 27వ తేది వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ నుంచి పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశించారు. వేములవాడ ఆలయ ప్రాంగణం, పార్కింగ్‌ ప్రదేశాలు, ఆలయంలోకి వచ్చివెళ్లే దారులు, క్యూలైన్‌లు, కళ్యాణకట్ట, ధర్మగుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్‌, ఆలయాధికారులతో కలిసి గురువారం పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహా శివరాత్రి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాల పార్కింగ్‌ కోసం గత సంవత్సరం కంటే ఎక్కువ పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బందికి టెంట్‌, తాగునీటి సదుపాయాలు కల్పించాలని, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ల వద్ద సూచిక బోర్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతామన్నారు. ప్రధాన ఆలయంతో పాటుగా అనుబంధ దేవాలయాల వద్ద, పార్కింగ్‌ ప్రదేశాల వద్ద శివార్చన ప్రదేశంలో, ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ మురళికృష్ణ, సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఈఈ రాజష్‌, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, ఏఈ రామ్‌కిషన్‌రావు, ఎస్‌ఐ ప్రేమ్‌నందన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:34 AM