మళ్లీ ‘రేషన్’ దరఖాస్తులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:14 AM
ఏన్నో ఏండ్లుగా రేషన్ కార్డుల జారీ లబ్ధిదారులు, అర్హులను ఊరిస్తూనే ఉంది. జనవరిలో కులగణన సర్వేలో రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించి జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించారు. ఇందులో చాలామంది పేర్లు రాకపోవడంతో అయోమయం చెందారు. ఆందోళన కలిగిస్తున్న క్రమంలో లబ్ధిదారులకు మీ సేవా ద్వారా మరోసారి దరఖాస్తులు స్వీకరించడానికి పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది.

- మీ సేవా కేంద్రాలకు లబ్ధిదారుల పరుగులు
- కొత్తవారే దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు
- పదేళ్ల ఎదురుచూపుల్లో మళ్లీ నిరాశే
- జిల్లాలో 40వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్
- కుల గణన సర్వేలో 9,731 కుటుంబాలు మాత్రమే గుర్తింపు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఏన్నో ఏండ్లుగా రేషన్ కార్డుల జారీ లబ్ధిదారులు, అర్హులను ఊరిస్తూనే ఉంది. జనవరిలో కులగణన సర్వేలో రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించి జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించారు. ఇందులో చాలామంది పేర్లు రాకపోవడంతో అయోమయం చెందారు. ఆందోళన కలిగిస్తున్న క్రమంలో లబ్ధిదారులకు మీ సేవా ద్వారా మరోసారి దరఖాస్తులు స్వీకరించడానికి పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. ఆదేశాలు ఇచ్చిన మొదటి రోజు మీ సేవా కేంద్రాలకు పరుగులు తీసినా వారికి నిరాశే కలిగింది. మళ్లీ తిరిగి వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను పునరుద్ధరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ఆరు గ్యారంటీల సందర్భంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. గత నెలలో కులగణన సర్వేలో, ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను ఆన్‌లైన్ చేశారు. కానీ జాబితాల్లో పేర్లు లేకపోవడంతో ప్రభుత్వం మళ్లీ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించడంతో గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు సైతం మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. కుల గణన సర్వేలో ఇచ్చిన ఆన్‌లైన్‌లో చేసిన వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో దరఖాస్తుదారులు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొత్త కార్డుల కోసం, చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు గ్యారంటీలకు వివిధ ఆప్షన్లతో 1.92 లక్షల దరఖాస్తులు రాగా, 40 వేల మంది రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందరికి కార్డులు వస్తాయని ఎదురుచూస్తున్న క్రమంలో ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తుల్లో 25 శాతం మంది పేర్లు మాత్రమే వచ్చాయి. జిల్లాలో గత సంవత్సరం నవంబరు డిసెంబరులో కులగణన సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను సైతం గుర్తించారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,731 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు. బోయినపల్లి మండలంలో 553, చందుర్తిలో 655, ఇల్లంతకుంటలో 903, గంభీరావుపేటలో 717, కోనరావుపేటలో 836, ముస్తాబాద్‌లో 903, రుద్రంగిలో 314, సిరిసిల్లలో 1420, తంగళ్లపల్లిలో 710, వీర్నపల్లిలో 217, వేములవాడ అర్బన్ మండలంలో 819, వేములవాడలో 421, వేములవాడ రూరల్‌లో 496, ఎల్లారెడ్డిపేటలో 767 కుటుంబాలను గుర్తించి సర్వేలు చేశారు. గత నెల గ్రామసభల్లో అర్హుల జాబితాల్లో పేర్లు లేకపోవడంతో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈసారైనా కొత్త రేషన్ కార్డు వస్తుందనే ఆశతో మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు.
చేర్పులు మార్పులు పూర్తయ్యేనా..?
జిల్లాలో ప్రస్తుతం లక్షా 73 వేల 728 రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులు 4,97,000 మంది ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,59,760, అంత్యోదయ కార్డులు 13,761, అన్నపూర్ణ కార్డులు 207ఉన్నాయి. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు రాకపోగా, కనీసం ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చకపోవడం, చేర్పులు, మార్పులు కూడా జరగలేదు. జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. చేర్పుల, మార్పుల దరఖాస్తుల పెండింగ్‌లో బోయినపల్లిలో 1,321, చందుర్తిలో 1,760, కోనరావుపేటలో 1,403, ముస్తాబాద్ 1,914, రుద్రంగిలో 948, సిరిసిల్లలో 2,689, తంగళ్లపల్లిలో 1,333, వీర్నపల్లిలో 481, వేములవాడ రూరల్‌లో 1,105, వేములవాడలో 2,105, ఎల్లారెడ్డిపేటలో 2,032 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొంత మంది మళ్లీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారు. 2018 సంవత్సరానికి ముందు దరఖాస్తులు చేసుకున్నా వారిలో 2021 ఆగస్టులో 2,271 మందికి రేషన్ కార్డులు అందించారు. ఆ తరువాత మళ్లీ రేషన్ కార్డుల ఆశలు ముందుకు వచ్చాయి.