Share News

Kaleshwaram project: కమిషన్‌ నివేదిక తర్వాతే ఇంజనీర్లపై చర్యలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:51 AM

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించని అధికారులపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదిక చేతికి అందాకే తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Kaleshwaram project: కమిషన్‌ నివేదిక తర్వాతే ఇంజనీర్లపై చర్యలు

  • ప్రస్తుతానికి 30 మంది పదోన్నతులకు బ్రేక్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించని అధికారులపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదిక చేతికి అందాకే తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టిన విజిలెన్స్‌ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా 38 మందికి నోటీసులు అందించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి నోటీసులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించగా... ఇప్పటిదాకా 36మందికి నోటీసులు చేరినట్లు సమాచారం. శుక్రవారం నాటికల్లా బాధ్యులైన అధికారులందరికీ నోటీసులు చేరనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారకులని భావిస్తున్న 17మందిపై నేరపూరిత కేసులో విచారణ చేపట్టాలని, 33 మందిపై శాఖపరమైన చర్యలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌), పదవీ విరమణ చేసిన 7మందికి సవరణ పెన్షన్‌ నిబంధనలు అనుసరించి, పెన్షన్‌లో కోత విధిస్తూ పెనాల్టీలు విధించాలని విజిలెన్స్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


ఒకొక్కరిపై రెండు, మూడేసి అభియోగాలు ఉండటంతో 38 మందిని బాధ్యులుగా గుర్తించి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా నోటీసులు ఇచ్చారు. వీరిలో సర్వీసులో ఉన్న వారితోపాటు పదవీ విరమణ పొందిన వారూ ఉన్నారు. నోటీసు అందుకున్న 21 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, వచ్చే నెల 10వ తేదీ తర్వాత జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశాలున్నాయని సమాచారం. నోటీసులు అందుకున్న వారి నుంచి సంజాయిషీ కూడా అదే సమయంలో అందనుంది. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక...తదుపరి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతానికి సర్వీసులో 32 మంది ఉండగా... వీరిలో ఇద్దరు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దాంతో మిగిలిన 30మంది పదోన్నతులకు బ్రేక్‌ పడే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 20 , 2025 | 03:51 AM