Share News

Kaleshwaram Project: రాజలింగమూర్తి ఫిర్యాదుకు కాలం చెల్లింది

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:29 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా ఇతరులు కారణమని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Kaleshwaram Project: రాజలింగమూర్తి ఫిర్యాదుకు కాలం చెల్లింది

  • ఆయనే మరణించినప్పుడు కాళేశ్వరంపై విచారణ అసాధ్యం

  • హైకోర్టు అభిప్రాయం.. భారీగా ప్రజాధనం వృథా అయింది

  • ఫిర్యాదుదారు లేకున్నా ప్రొసీడింగ్స్‌ కొనసాగించవచ్చు

  • పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు.. సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా ఇతరులు కారణమని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫిర్యాదుకు కాలం చెల్లిందని హైకోర్టు అభిప్రాయపడగా, విచారణ కొనసాగించవచ్చని ప్రభుత్వం వాదించింది. దీనిని దాఖలు చేసిన నాగవెల్లి రాజలింగమూర్తి మరణించడంతో ఆయన భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు కాలంచెల్లిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు చనిపోయినట్లు పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. ఫిర్యాదుదారుడే లేనప్పుడు ఆ ప్రైవేట్‌ కంప్లైంట్‌పై ఇక విచారణ చేపట్టి ప్రయోజనం ఉండదని పేర్కొంది. కాళేశ్వరం అవినీతిపై దాఖలైన ఫిర్యాదుపై వ్యక్తిగతంగా హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొంటూ కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ మరోసారి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


కేసీఆర్‌, హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇది ప్రైవేట్‌ కంప్లైంట్‌ కాబట్టి ఫిర్యాదుదారు చనిపోయినందున ఇక విచారించడానికి ఏమీ లేదని తెలిపారు. రాజలింగమూర్తి తరఫు న్యాయవాది అభినవ్‌ వాదించడానికి ప్రయత్నించగా చనిపోయిన వ్యక్తి తరఫున ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చనిపోయిన వ్యక్తి మీకు ఏ సూచనలు ఇవ్వగలరని అడిగింది. ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ఫిర్యాదుదారు లేకపోయినా ప్రైవేటు కంప్లైంట్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను దిగువ కోర్టులో కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ధర్మాసనం పిటిషన్‌ను ముగిస్తామని ఆదేశాలు ఇవ్వబోతుండగా.. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పులను సమర్పిస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశం చాలా ముఖ్యమైనదని.. భారీ ప్రజాధనంతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తాము కేసు మెరిట్స్‌ గురించి మాట్లాడటం లేదంది. చనిపోయిన వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేట్‌ కంప్లైంట్‌పై కేసు కొనసాగించవచ్చా? లేదా? అనే సాంకేతిక అంశంపై వాదనలు వింటున్నామని పేర్కొంది. ఆయన పదే పదే కాళేశ్వరం అవినీతిపై వాదనలు వినిపించడాన్ని అడ్డుకుంది. సోమవారం వరకు సమయం అడగడంతో విచారణను వాయిదా వేసింది.

Updated Date - Feb 22 , 2025 | 04:29 AM