Medigadda Barrage Investigation: కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:22 AM
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్‌ను విచారించనున్నట్లు తెలిసింది.
మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది?
సబ్ కమిటీకి, బ్యారేజీలకు సంబంధం ఉందా?
మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించనున్న కమిషన్
రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం!
నేడు విచారణకు హాజరుకానున్న కేసీఆర్
ఆయన ఏం చెబుతారనేదానిపై ఉత్కంఠ
ఫాంహౌస్‌లో మరోసారి హరీశ్‌తో సుదీర్ఘ చర్చ
బీఆర్కే భవన్‌కు భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు!
కేసీఆర్‌కు మద్దతుగా కవిత అనుచరులు కూడా?
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్‌ను విచారించనున్నట్లు తెలిసింది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్ ముందు పలువురు వాంగ్మూలం ఇవ్వగా.. తాజాగా మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. హరీశ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాకే కాళేశ్వరం బ్యారేజీలపై, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై నిర్ణయం తీసుకున్నారని వాదనలు వినిపిస్తుండగా.. మంత్రివర్గ ఉపసంఘానికి, కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.2591 కోట్లతో అనుమతి ఇవ్వాలంటూ అప్పటి ఈఎన్‌సీ సి.మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. వాటికి అనుగుణంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి అనుమతినిస్తూ 2016 మార్చి 1న జీవో జారీ చేసింది. ఈ జీవో విడుదలైన 14 రోజుల తర్వాత అంటే 2016 మార్చి 15న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నాటి సీఎస్ రాజీవ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ చైర్మన్‌గా, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ జీవో 655 జారీ చేశారు. కానీ, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదించిందని ఇటీవల ఈటల కమిషన్ ఎదుట చెప్పారు. నాటి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్న తుమ్మల దీన్ని ఖండించారు. మంత్రివర్గ ఉపసంఘానికి, మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదని ప్రకటించారు. మరోవైపు హరీశ్ కూడా ఈటల వ్యాఖ్యలకు కొనసాగింపుగా సమాధానాలిచ్చారు.
కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖలతో పాటు వ్యాప్కోస్ నివేదిక తర్వాతే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు కమిషన్ ఎదుట వాం గ్మూలం ఇచ్చారు. వాస్తవానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టడానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం వ్యాప్కో్‌సకు పని అప్పగించినట్లు కమిషన్ గుర్తించింది.ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణ విషయంలో అన్ని ఆధారాలను ముందు పెట్టుకొని ఆయన్ను ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరం ఆమోదించిన తేదీ ఏంటీ? సబ్‌కమిటీ వేసిందెప్పుడు? సబ్ కమిటీ సిఫారసులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా? లేదా? అని కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీల ను ఇసుక పునాదులపై కట్టడానికి డిజైన్లు/డ్రాయింగ్‌లు ఇస్తే, వాటికి విరుద్ధంగా కట్టారన్న జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ)ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ల విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. గతంలో ఏలేరు భూకుంభకోణంపై విచారణకు మాజీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
కేసీఆర్ ఏం చెబుతారో?
మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధం లేదని, దాని అజెండాలో కాళేశ్వరం లేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. ప్రా ణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గ ఉపసంఘం వేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఏప్రిల్ 2న మేడిగడ్డ వద్ద బ్యారేజీ డీపీఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కో్‌సకు ఇవ్వడానికి అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి సీఈ లేఖ రాయగా.. ఏప్రిల్ 13న డీపీఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కో్‌సకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ముందే నిర్ణయాలు తీసుకొని, ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడానికి అ నువుగా డీపీఆర్ ఇవ్వాలని వ్యాప్కో్‌సను ప్రభుత్వం కోరినట్లు తేలింది. దీంతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట ఎవరు నిజాలు చెబుతున్నారు? ఎవరు అబద్ధాలు చెబుతున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట ఏం చెబుతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డకు ప్రా జెక్టు స్థలం మార్పు, డిజైన్లు, నాణ్యత లోపం, నిర్వహణ లేకపోవడం, బ్యారేజీ కుంగిపోవడం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్‌కు వస్తున్న దృష్ట్యా.. ఎమ్మెల్సీ కవిత వర్గం కూడా కేసీఆర్‌కు మద్దతుగా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
భారీ కాన్వాయ్‌తో కేసీఆర్..
ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు కేసీఆర్ బుధవారం భారీ కాన్వాయ్‌తో రానున్నారు. ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం ఆయన ఫాంహౌస్‌లో మరోసారి హరీశ్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్‌కు ఇచ్చేందుకు ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసిన కేసీఆర్.. హరీశ్‌ను అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదికను కూడా రూపొందించుకున్నట్లు తెలిసింది. అలాగే కమిషన్ అవకాశం ఇస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విచారణకు వెళ్లే సమయంలో కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు విచారణ పూర్తికాగానే తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పార్టీ నేత ఒకరు చెప్పారు.