Share News

Kaleshwaram Project: ఇచ్చిన ఫైళ్లు సరిపోతాయి.. మిగతావి ఇక వద్దు!

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:13 AM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విచారణతో ముడిపడిన పత్రాలన్నీ తమకు చేరాయని.. మిగతా ఫైళ్లు అక్కర్లేదని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది.

Kaleshwaram Project: ఇచ్చిన ఫైళ్లు సరిపోతాయి.. మిగతావి ఇక వద్దు!

  • కాళేశ్వరం ప్రాజెక్టు పత్రాలపై సర్కారుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విచారణతో ముడిపడిన పత్రాలన్నీ తమకు చేరాయని.. మిగతా ఫైళ్లు అక్కర్లేదని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు బుధవారం నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నట్లు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముందా..? ఒకవేళ ఉంటే ఆ పత్రాలు ఇవ్వాలని కమిషన్‌ ఈనెల 13న ప్రభుత్వానికి లేఖ రాయగా.. అదేరోజు అధికారులంతా వెళ్లి కమిషన్‌కు పత్రాలు సమర్పించారు.


2014-2023 మధ్యకాలంలో 96 మంత్రివర్గ సమావేశాలు జరగ్గా... ఎందులోనూ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు కానీ, కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అనుమతులు ఇవ్వలేదని తేలింది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సవరణ అంచనాలకు మాత్రమే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారని గుర్తించారు. ఈ క్రమంలోనే జస్టిస్‌ పీసీ ఘోష్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికకు తుది రూపు ఇచ్చే పనిలో పడ్డారు. ఈ నెలాఖరున లేదా జూలై మొదటి వారంలో కమిషన్‌ ప్రభుత్వానికి కమిషన్‌ నివేదికను సమర్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Updated Date - Jun 19 , 2025 | 04:13 AM