KCR: విచారణకు ఓకే
ABN , Publish Date - May 28 , 2025 | 04:07 AM
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హరీశ్, కేటీఆర్‌తో చర్చలు జరిపారు; సమాచార సేకరణ కొనసాగుతోంది.
కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్
5న హాజరు కావాలని నిర్ణయం
ఇప్పటికే దీనిపై హరీశ్, కేటీఆర్‌లతో భేటీలు
విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ..
ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ
9న హాజరవనున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉత్కంఠకు తెరపడింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాల అనంతరం జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9న విచారణకు హాజరవుతానని ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇప్పటికే వందకుపైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నామని వారిలో అత్యధికులు కమిషన్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంది. విచారణకు హాజరవుతామని హరీశ్ రావు, ఈటల స్పష్టం చేసినా.. కేసీఆర్ విషయంలో ఉత్కంఠ రాజ్యమేలింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ విద్యుత్తు అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు కాలేదు. దాంతో, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది.
అయితే, విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై ఇప్పటికే కేసీఆర్ రెండు దఫాలుగా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మాజీ మంత్రి హరీశ్ రావుతో.. ఒకసారి కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నోటీసులపై ఏవిధంగా స్పందించాలి? విచారణ సమయంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇవ్వాలా? లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలా? అన్న దానిపై కూడా వారు సమాలోచన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే విచారణకు వెళ్లి వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ బీఆర్‌ఎస్ అధినేత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు డ్యామేజీ అయ్యేవరకు జరిగిన పరిణామాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్ నివేదికలో ఏం పేర్కొన్నారు? ఎక్కడ లోపాలు జరిగాయి? ఎన్‌డీఎ్‌సఏ ఏం చెప్పింది!? కాళేశ్వరం కమిషన్‌కు నిర్మాణ సంస్థలు ఏం సమాచారం ఇచ్చాయి? సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏమిటన్న దానిపైనా ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినట్లు తెలిసింది.