Share News

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో అన్యాయం.. కాళేశ్వరం లోపాలపై సర్కారు ఫోకస్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:00 AM

నీళ్లూ నియామకాలు నిధులు.. సొంత రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రధాన నినాదం...

 Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో అన్యాయం.. కాళేశ్వరం లోపాలపై సర్కారు ఫోకస్‌

  • సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు నేడు మంత్రి ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నీళ్లూ నియామకాలు నిధులు.. సొంత రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రధాన నినాదం. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిలోదకాలు.. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు సమర్థన.. ఉమ్మడి రాష్ట్రంలోని చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా రీ ఇంజనీరింగ్‌ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు.. వాటి నిర్మాణంతో ప్రజలపై పడిన భారాన్ని తెలంగాణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నది. ఈ విషయమై మహాత్మాజ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్‌ ఆహ్వానాలు పంపారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తరలించిన కృష్ణా జలాలు, గత తొమ్మిదిన్నరేళ్లలో తరలించిన జలాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెం డర్లను పిలవడానికి గత ప్రభుత్వ పరోక్ష సహకారాన్ని మంత్రి ఉత్తమ్‌ వివరిస్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కృష్ణా జలాల్లో 50 శాతానికి పైగా వాటా కోరడానికి బదులు.. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేంద్రం ముందు ఒప్పుకుని మిగతా 512 టీఎంసీలు ఏపీకి తరలించేందుకు గత బీఆర్‌ఎస్‌ సర్కారు సంతకాలు చేసిన ఒప్పందం 2022 వరకూ కొనసాగిందని వెల్లడిస్తారు. డిజైన్‌ లోపాలు, సరైన పరీక్షలు చేయకుండానే బ్యారేజీలు కట్టడంతో 2023 అక్టోబరులో మేడిగడ్డ కుంగితే, అదే ఏడాది అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు బయటపడ్డాయని ఉత్తమ్‌ వివరించనున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:00 AM