Jurala Project: జూరాల ప్రాజెక్టుకు నిలకడగా వరద
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:46 AM
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నిడకడగా కొనసాగుతోంది. ఆదివారం 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, ప్రాజెక్టులో 2.3 టీఎంసీల నీరు ఉంది.
ధరూరు/ఆత్మకూరు/దోమలపెంట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నిడకడగా కొనసాగుతోంది. ఆదివారం 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, ప్రాజెక్టులో 2.3 టీఎంసీల నీరు ఉంది. జెన్‌కో జలవిద్యుత్ కేంద్రాలకు 15,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ కెనాల్‌కు 1500, కోయిల్‌సాగర్ లిఫ్ట్ కెనాల్‌కు 315, మొత్తం 17,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 8 యూనిట్లు ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 41,944 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, 62.4320 టీఎంసీల నీరు ఉంది. 6,785 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
నేడు నైరుతిలో కదలిక
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం నుంచి బలమైన తేమగాలులు వీస్తుండడం, రుతుపవనాలు చురుగ్గా మారడంతో దక్షిణ భారతం, దానికి ఆనుకుని పశ్చిమ భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రుతుపవనాల్లో కదలిక వచ్చింది. సోమవారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.