Jubilee Hills Voters: గుంభనంగా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:03 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ. ఎవరిని కదిలించినా.. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారు ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి అనే అంశంపైనే మాట్లాడుతున్నారు....
ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటరు తీరు
మనసులో మాట బయటపెట్టేందుకు ససేమిరా
ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ
పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు
16 శాతం ఈ క్యాటగిరీలోనే అంటున్న సర్వేలు
పైసలిచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు
బస్తీ పెద్దమనిషి చెప్పిన పార్టేకేనన్న మరికొందరు
స్పష్టంగా అభిప్రాయం చెబుతున్న పార్టీల అభిమానులు
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ. ఎవరిని కదిలించినా.. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారు? ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి? అనే అంశంపైనే మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైసే చూస్తోంది. అక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పుకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కానీ, జూబ్లీహిల్స్ ఓటరు మాత్రం నోరువిప్పడం లేదు. తన మనసులో ఏముందో ఎవరికీ చెప్పడంలేదు. మీ ఓటు ఎవరికి? అని ప్రశ్నిస్తే, ‘ఆ ఒక్కటి అడగొద్దు’ అంటూ సైలెంట్ అవుతున్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించినా, సర్వేల్లో చూసినా ఈ సైలెంట్ ఓటింగ్ ఈసారి భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సర్వేల్లో తటస్థ ఓటర్లు 5-6 శాతం వరకు ఉంటుంటారు. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పలు సంస్థలు చేస్తున్న సర్వేల్లో ఈ తటస్థ ఓటర్లు 16 శాతానికి పైనే ఉంటోంది. కొన్ని సర్వేల్లో ఒక పార్టీ మూడు శాతం ఆధిక్యంలో ఉందంటే.. మరికొన్ని సర్వేల్లో ఇంకో పార్టీ మూడు శాతం ఆధిక్యంలో ఉందని వస్తోంది. అయితే ఈ రెండు రకాల సర్వేల్లోనూ సైలెంట్ ఓటింగ్ అనే కామన్ పాయింట్ ప్రధాన పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. ఊహించని విధంగా భారీగా ఉన్న ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సర్వేల్లోనే కాకుండా.. క్షేత్రస్థాయిలో ఓటరును పలకరించినా వ్యూహాత్మక సమాధానమే వస్తోంది. పార్టీలకు పక్కా ఓటర్లుగా ఉన్నవారు తాము ఎవరివైపో బహిరంగంగానే చెప్పేస్తున్నా.. ఏదీ చెప్పకుండా తప్పించుకుంటున్నవారూ పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. ప్రభుత్వం ఎలా ఉంది? ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి? అనే అంశం నుంచి ప్రపంచ రాజకీయాల దాకా అన్నీ మాట్లాతున్నాడు కానీ.. తన ఓటు ఎవరికి అంటే మాత్రం చెప్పడంలేదు.
మాకూ ఓ లెక్కుంది..!
డివిజన్ల వారీగా తమకు పడే ఓట్లు ఇన్ని అంటూ పార్టీలు, నాయకులు ఎవరి లెక్కల్లో వారు ఉంటే.. ఓటర్లు కూడా తమ లెక్క తమకు ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓటరు మనోగతం తెలుసుకోవడం పార్టీలకు కష్టతరంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, బోరబండ, రహమత్‌నగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు పర్యటించి ఓటర్ల అభిప్రాయాలు కోరగా.. వారి నుంచి వ్వూహాత్మక సమాధానాలే వచ్చాయి. ‘‘పెళ్లి చేసి పంపించడమే మన వరకు ఉంటుంది. అబ్బాయి పుడుతుందా? అమ్మాయి పుడుతుందా? అన్నది డెలివరీ అప్పుడే తెలుస్తుంది’’ అని ఒక ఓటరు వ్యాఖ్యానించాడు. ఇంకో ఆయన్ను గుచ్చి గుచ్చి అడిగితే, ‘అంతా ఎటువేస్తే నేనూ అటే’ అన్నాడు. ఇంకో ఆయనైతే, ‘‘మీరు సర్వే చేస్తున్నారా? మీ సర్వేలో ఏమొచ్చింది?’’ అని ఆసక్తిగా అడిగాడు తప్ప.. తన మనసులో ఏముందో మాత్రం చెప్పలేదు. ఇక యువతరం ఓటర్లలో కొందరు తాము ఏ పార్టీకీ ఓటు వేసేది లేదని నిక్కచ్ఛిగా చెబుతున్నారు. ఒక మెకానిక్ షాపులో ఉన్న వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి ఒంటరిగా ప్రశ్నించగా, ‘ఎవరికి వేస్తే మాత్రం ఏం లాభం!’ అని వ్యాఖ్యానించాడు. కొన్ని డివిజన్లలోని బస్తీల్లో ఓటర్లను కదిలించగా, ‘మా బస్తీ పెద్దమనిషి ఎవరికి చెప్తే వారికి వేస్తాం. ఈసారి ఇంకా చెప్పలేదు’ అని అన్నారు. అయితే ఇలా చెప్పిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.
అన్ని పార్టీల్లోనూ కుల సంఘాల నేతలు..
నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ప్రచారం చేస్తుండగా.. మరోవైపు కులసంఘాల నేతలు కూడా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గంగపుత్రుల సంఘం, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఇలా ప్రతి ఒక్కటీ ఎక్కడో ఒకచోట సమావేశం పెడుతున్నాయి. తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెబుతున్నాయి. అయితే షేక్‌పేటలో ఒక చోట గంగపుత్రుల సంఘం సమావేశం పెట్టి ఒక పార్టీకి ఓటేయాలని చెప్పగా.. బోరబండలో అదే గంగపుత్రులతో ఉన్న మరో సంఘం ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పింది. అన్ని సంఘాలు, వాటిలోని నేతలు అన్ని పార్టీల్లోనూ ఉండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
ఒక్కొక్కరు ఒక్కో పార్టీకి..
బోరబండ డివిజన్‌లోని కళ్యాణ్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్ ప్రాంతాల్లోని ఓటర్లు మిశ్రమంగా స్పందించారు. ‘‘గతంలో బీఆర్‌ఎ్‌సకు వేశాను. కానీ, ఈసారి కాంగ్రె్‌సకు వేద్ద్దామనుకుంటున్నాను. అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది’’ అని ఓ యువకుడు అన్నారు. ఓ ముస్లిం ఓటరు మాత్రం, ‘‘కాంగ్రెస్ ముస్లింకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింల ఓట్లు పడతాయా? ఎన్నికలప్పుడు అవసరానికి మమ్మల్ని మచ్ఛిక చేసుకోవాలని చూస్తే.. ఏది నిజమో, ఏది మోసమో మాకు తెల్వదా? అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మాకు ఏమైనా లాభం చేకూరుతుందా?’’ అని ప్రశ్నించారు. ఇక ఉచిత బస్సు పథకంపై మహిళలు సానుకూలంగా ఉండగా, పురుషులు అందుకు భిన్నంగా స్పందించారు. మహిళలకు ఉచితమని చెప్పి.. పురుషుల మీద ఆ భారం వేశారని వాపోయారు.
మొదటిసారి ఓటర్లూ అంతే..!
మొదటిసారి ఓటుహక్కు వచ్చినవారు కూడా తమ ఓటు ఎవరికి అన్నది చెప్పడం లేదు. తమకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని, ఎవరికో ఒకరికి ఓటేస్తామని అంటున్నారు. కొన్ని డివిజన్లలో మాత్రం యువత తాము ఏ పార్టీకి ఓటేస్తామన్నది మొహం మీదే చెబుతున్నారు. షేక్‌పేట, రహమత్‌నగర్ డివిజన్‌లలో కొందరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల యువత మాత్రం ఏ పార్టీకి ఓటెయ్యబోమని, నోటాకు వేస్తామని చెప్పడం గమనార్హం.
ఎవరు పైసలిస్తే వారికే ఓటు!
కొందరు ఓటర్లు తమకు డబ్బులిచ్చిన పార్టీకే ఓటు వేస్తామని చెప్పారు. ‘‘పార్టీల నాయకులంతా పైసలు పంచుతున్నారు. మాకు మాత్రం ఎవరూ ఇయ్యలేదు. పైసలిస్తేనే ఓటు వేస్తాం. లేదంటే లేదు’’ అని షేక్‌పేట డివిజన్‌లోని ఐకమత్యనగర్‌లో ఓ గల్లీలోని మహిళలు తెగేసి చెప్పారు. బోరబండలో కూడా కొన్ని చోట్ల, ‘మా ఇంట్లో ఆరు ఓట్లున్నాయి. డబ్బులను బట్టి, బస్తీ సంఘాలు చెప్పినదాన్ని బట్టి పోలింగ్ రోజు డిసైడ్ చేస్తాం’’అని అన్నారు. ‘నాయకుల మస్తు సంపాదించుకుంటరు.మాకు ఎన్నికలప్పుడే కదా ఇచ్చేది! ఎందుకు వదలాలి’ అని సీతానగర్ బస్తీలో ఒక ఓటరు వ్యాఖ్యానించాడు.