Share News

Maganti Gopinath: మాగంటికి కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:10 AM

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈ నెల 5న మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు వాత్సల్యనాథ్‌, అక్షర నాగ, దిశిర ఉన్నారు.

Maganti Gopinath: మాగంటికి కన్నీటి వీడ్కోలు

ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే

నివాళులర్పించిన సీఎం రేవంత్‌, భట్టి, నేతలు

కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్‌

ఆస్పత్రి నుంచి మహాప్రస్థానం వరకు

మాగంటి కుటుంబం వెంట కేటీఆర్‌, హరీశ్‌

మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాన్షు

చివరి చూపుకోసం భారీగా తరలివచ్చిన

బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌, యూస్‌ఫగూడ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈ నెల 5న మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు వాత్సల్యనాథ్‌, అక్షర నాగ, దిశిర ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అనుచరులు, మిత్రులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ, తనయుడు హిమాన్షు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు పార్టీ నేతలు, అభిమానులు ఆస్పత్రికి చేరుకున్నారు. మాగంటి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌ వసంత హైట్స్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. మాగంటి గోపీనాథ్‌ చివరి చూపుకోసం నేతలు, ప్రముఖులు, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. మాగంటి భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, పొన్నం, తుమ్మల, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, సినీనటుడు మాగంటి మురళీమోహన్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఆయన సతీమణి నారా బ్రాహ్మణితోపాటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు నివాళులు అర్పించారు. నేతలు, అభిమానులు సందర్శన అనంతరం ఆదివారం సాయంత్రం గోపీనాథ్‌ అంతిమయాత్ర మొదలైంది. మాదాపూర్‌లో నివాసం నుంచి ప్రారంభమైన మాగంటి అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు సాగింది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు జరిగాయి. చితికి గోపీనాథ్‌ కుమారుడు వాత్సల్యనాథ్‌ నిప్పంటించారు.


కన్నీటి పర్యంతమైన కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఉదయం 11.30 గంటల సమయంలో మాగంటి నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. ఈ సమయంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్‌ను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. తర్వాత ఇంటి లోపలికి వెళ్లి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటి ఎంతో కష్టపడి ఎదిగారని, సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరుపొందారని, ఆయన మరణం తీరని లోటని కేసీఆర్‌ పేర్కొన్నారు.

అన్నీ తామై వ్యవహరించిన కేటీఆర్‌, హరీశ్‌.

మాగంటి ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి అంత్యక్రియల వరకు అన్నింటినీ కేటీఆర్‌, హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. అంతిమయాత్రలో మాగంటి పాడెను మోశారు. మాగంటి గోపీనాథ్‌, కేటీఆర్‌ల మధ్య రాజకీయపరంగానే కాకుండా కుటుంబ స్నేహబంధం కూడా ఉంది. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు, మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్‌ ఇద్దరు హైదరాబాద్‌లో కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు కూడా. హిమాన్షు తరచూ మాగంటి నివాసానికి వచ్చేవారు. మాగంటి బీఆర్‌ఎ్‌సలో చేరాక ఇరు కుటుంబాల మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి కేటీఆర్‌ కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కేటీఆర్‌ సతీమణి శైలిమ మాగంటి కుటుంబ సభ్యులతోపాటు ఉండి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌ విదేశీ పర్యటన కుదించుకుని తిరిగివచ్చారు. హిమాన్షు కూడా స్నేహితుడికి అండగా నిలిచేందుకు అమెరికా నుంచి వచ్చారు. ఆస్పత్రి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వాత్సల్యనాథ్‌ వెంటే ఉన్నారు. కాగా, మాగంటి మృతి బాధాకరమని, బీఆర్‌ఎ్‌సకు తీరని లోటు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగిన మాగంటి జీవితం ఆదర్శనీయమని హరీశ్‌రావు చెప్పారు.


గవర్నర్‌, రేవంత్‌, ప్రముఖుల నివాళి

మాగంటి మృతిపట్ల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాగంటి గోపీనాథ్‌ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తదితర ప్రముఖులు మాగంటి మృతిపట్ల సంతాపం తెలిపారు. కాగా, మాగంటి గోపీనాథ్‌ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెప్పారు. ఆయన మాగంటి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బుల్లెట్‌ ర్యాలీతో ఆకట్టుకుని

ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన 1983లోనే మాగంటి ఆ పార్టీలో చేరారు. క్రమంగా ఎన్టీఆర్‌ వ్యక్తిగత బృందంలో సభ్యుడిగా మారారు. 1984లో రాజకీయ సంక్షోభంతో ఎన్టీఆర్‌ సీఎం పదవి కోల్పోయిన సమయంలో, 1985 ఎన్నికల్లో భారీ విజయం సాధించి తిరిగి సీఎంగా పదవి చేపట్టినప్పుడు.. మాగంటి తీసిన బుల్లెట్‌ బైకుల ర్యాలీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రచారంలో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా మాగంటి తన బృందంతో కలిసి పాల్గొన్నట్టు టీడీపీ నేతలు చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎన్టీఆర్‌ వాహనం ముందు బుల్లెట్‌ బైకులతో ర్యాలీగా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి తమిళనాడు సీఎం రాంచంద్రన్‌ తన వద్దకు మాగంటిని పిలిపించుకుని బుల్లెట్‌ ర్యాలీ చేసి చూపించాలని కోరారు. ఆ ర్యాలీ చూసి అభినందించారు.

ఎన్టీఆర్‌ అస్థికలను మోసి..

ఎన్టీఆర్‌ మరణం మాగంటిని తీవ్రంగా కలచివేసింది. నాడు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఎన్టీఆర్‌ అస్థికలు ఉన్న కుండను బంజారాహిల్స్‌ ఇంట్లో భద్రపరిచారు. ఆ కుండను మాగంటి గోపీనాథ్‌ స్వయంగా నెత్తిన పెట్టుకొని బయటికి తీసుకువచ్చి ఊరేగింపుగా వాహనంలో పెట్టారు. ఎన్టీఆర్‌ అస్తికలు ముట్టుకునే అవకాశం దక్కడం తాను ఎప్పటికీ మరవలేనని మాగంటి చెప్పేవారు. ఆ సమయంలో తీసిన ఫొటోలను ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ స్మరించుకునేవారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:10 AM