సీఎం రేవంత్‌పై తిట్ల దండకం
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:42 AM
బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి.. తెలంగాణ భవన్‌లో రికార్డింగ్ చేసి.. సీఎం రేవంత్‌రెడ్డిపై తిట్ల దండకంతో వీడియోను విడుదల చేసిన జర్నలిస్టు రేవతి, ఆమెతో కలిసి పనిచేసే రిపోర్టర్ సంధ్యను హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ భవన్‌లో రికార్డింగ్
సామాజిక మాధ్యమాల్లో వైరల్
చంచల్‌గూడ జైలుకు జర్నలిస్టు రేవతి
రిపోర్టర్ సంధ్యకు కూడా 14రోజుల రిమాండ్
పరారీలో మరో ముగ్గురు: అదనపు సీపీ
అరెస్టును ఖండించిన కేటీఆర్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి.. తెలంగాణ భవన్‌లో రికార్డింగ్ చేసి.. సీఎం రేవంత్‌రెడ్డిపై తిట్ల దండకంతో వీడియోను విడుదల చేసిన జర్నలిస్టు రేవతి, ఆమెతో కలిసి పనిచేసే రిపోర్టర్ సంధ్యను హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ వివరాలను వెల్లడించారు. మాదాపూర్‌కు చెందిన పొగడదండ రేవతి నానక్‌రామ్‌గూడలో ‘పల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈమె కొత్తూరుకు చెందిన బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్‌ను తన వద్ద రిపోర్టర్‌గా నియమించుకున్నారు. గత నెల తెలంగాణ భవన్‌లో ఓ వ్యక్తితో సీఎం రేవంత్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయిస్తూ రికార్డ్ చేసిన వీడియోను.. పల్స్ చానల్ ద్వారా వైరల్ చేయించారు. అమెరికా నుంచి ‘నిప్పుకోడి’ హ్యాండిల్‌తో ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేసినట్లు విశ్వప్రసాద్ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ సోషల్‌మీడియా సెల్ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్లు 111, 61(2), బీఎన్‌ఎ్‌సలోని 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐదుగురిపై కేసు పెట్టారు.
ప్రధాన నిందితురాలిగా రేవతి, ఏ2గా సంధ్య, ఏ3గా వీడియోలో సీఎం రేవంత్‌ను దుర్భాషలాడిన వృద్ధుడు, ఏ4గా కెమెరామన్, ఏ5గా అమెరికా నుంచి ఎక్స్‌లో పోస్టు చేసిన వ్యక్తిని నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రేవతి, సంధ్యలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, అమెరికాలో ఉన్న వ్యక్తిపై లుక్‌ఔట్ నోటీసు జారీ చేశామని విశ్వప్రసాద్ చెప్పారు. రేవతికి బీఆర్‌ఎస్ నాయకులతో సంబంధాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈమెపై గతంలో రెండు కేసులున్నట్లు వివరించారు. రేవతి, సంధ్యను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుల తరఫు న్యాయవాది మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రజా సమస్యలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉంటుందని, ఓ రైతు ఆవేదనను ప్రసారం చేసినందుకు తమపై కేసులు పెట్టి, వేధిస్తున్నారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు. ఈ వాదనలను పీపీ తప్పుబట్టారు. గత నెల బీఆర్‌ఎస్ భవన్‌లో ఓ వృద్ధుడితో ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ ప్రతిష్ఠ మసకబారేలా తిట్టించారని ఆరోపించారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని, ఈ నెల 10 నుంచి ఆ వీడియోను వ్యూహాత్మకంగా వైరల్ చేశారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి.. రేవతి, సంధ్యకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. కాగా.. రేవతి అరెస్టును కేటీఆర్ ఖండించారు. యువ జర్నలిస్టు సంధ్య అరెస్టు దారుణమన్నారు.