Share News

‘వక్ఫ్‌’ నివేదికకు జేపీసీ ఓకే..

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:26 AM

కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లును పరిశీలించి.. పలు మార్పులు, సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) బుధవారం ఆమోదముద్ర వేసింది.

‘వక్ఫ్‌’ నివేదికకు జేపీసీ ఓకే..

15-11 మెజారిటీతో ఆమోదం

  • నేడు లోక్‌సభ స్పీకర్‌కు సమర్పణ

  • జేపీసీ చైర్మన్‌ జగదంబికాపాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 29: కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లును పరిశీలించి.. పలు మార్పులు, సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) బుధవారం ఆమోదముద్ర వేసింది. 15-11 మెజారిటీతో కమిటీ సదరు రిపోర్టును అంగీకరించిందని బీజేపీ ఎంపీ, జేపీసీ చైర్మన్‌ జగదంబికాపాల్‌ విలేకరులకు తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని.. బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్‌ బోర్డు తన విధులను మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తుల ప్రయోజనాలు పొందేవారి జాబితాలో తొలిసారి పస్మాందా ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను చేర్చామన్నారు. 655 పేజీలతో కూడిన తమ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పిస్తామని చెప్పారు.


బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లును ఆమోదిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. భావి కార్యాచరణను నిర్ణయించాల్సింది సభాపతి, పార్లమెంటేనని ఆయన స్పష్టంచేశారు. నిరుడు ఆగస్టు 8న ఏర్పాటైన ఈ జేపీసీ ఢిల్లీలో 38 సమావేశాలు నిర్వహించింది.కాగా.. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు మండిపడ్డాయి. కమిటీ పనితీరుపైన, అది ఆమోదించిన బిల్లుపైన కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, ఎంఐఎం సభ్యులు విమర్శలు గుప్పించారు. వారిలో కొందరు కమిటీకి అసమ్మతి నోట్‌ను సమర్పించారు. నివేదికలో దీనిని నమోదుచేయాల్సి ఉంటుంది. రిపోర్టు 655 పేజీలు ఉందని.. దానిని తమకు మంగళవారం సాయంత్రం పంపిణీ చేశారని.. బుధవారం సాయంత్రం 4 గంటల్లోపు అభిప్రాయం చెప్పాలన్నారని.. అన్ని పేజీలు చదివి నిరసన సిద్ధం చేసుకోవడానికి చాలా తక్కువ వ్యవధి ఇచ్చారని విపక్ష ఎంపీలు ఆక్షేపించారు. ‘వక్ఫ్‌ బై యూజర్‌ (దీర్ఘకాలం వక్ఫ్‌ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా సంక్రమిస్తుంది. కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేదు)’ అనే నిబంధనను తొలగించడాన్ని ఒవైసీ వ్యతిరేకించారు.

Updated Date - Jan 30 , 2025 | 05:26 AM