Jajula Srinivas Goud: బీసీ రిజర్వేషన్ల అమలుకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదు:జాజుల
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:53 AM
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు అవసరమైన సమయమిచ్చిందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42ు రిజర్వేషన్ల కల్పనకు నెల రోజులు చాలునన్నారు.
ఇప్పటికైనా రాజకీయాల్లేకుండా బీసీల రిజర్వేషన్ల పెంపునకు ఇరు పార్టీలు తక్షణం కార్యాచరణ ప్రారంభించాలని శ్రీనివాస్ గౌడ్ హితవు చెప్పారు. దేశంలో కులగణన చేస్తామని ప్రకటించిన బీజేపీ, రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన కాంగ్రెస్.. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో ఎందుకు తాత్సారం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై జాప్యం చేస్తే రాజకీయంగా వారిని అణచివేసేందుకు ఆలోచిస్తున్నట్లు భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకెళితే బీసీలు సహించరన్న సంగతి రాజకీయ పార్టీలు గ్రహిస్తే మంచిదని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దేనని.. అంత వరకూ కాంగ్రెస్, బిజెపిల వెంటపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.