Jagadish Reddy: వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:42 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్లగొండ మంత్రులిద్దరూ దద్దమ్మలు : జగదీశ్ రెడ్డి
నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలడానికి మాజీ సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేయించారంటూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ జిల్లాకు సాగునీరివ్వలేని దద్దమ్మలు. వీళ్లకి జిల్లాపైనా, రైతులపైనా చిత్తశుద్ధి లేదు. ఏపీకి నీరొదలాలన్న ఆత్రుతే తప్ప, రైతులకు నీరివ్వాలనే తపన వీరికి లేదు’ అని వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ల ఆరాటాలు, కమీషన్ల దందాలు తప్ప రైతుల పట్ల వారికి ప్రేమలేదని విమర్శించారు.