Share News

ISRO: ‘వంద’ర్‌ఫుల్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:23 AM

ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.. షార్‌లో వందో మిషన్‌.. విజయవంతమైంది.

ISRO: ‘వంద’ర్‌ఫుల్‌

  • ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం

  • నింగిలోకి దూసుకెళ్లిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15

  • 19 నిమిషాల్లోనే కక్ష్యలోకి నావిక్‌-02

  • దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ మరింత బలోపేతం

  • రికార్డు విజయంతో ఇస్రో సరికొత్త చరిత్ర

సూళ్లూరుపేట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.. షార్‌లో వందో మిషన్‌.. విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికపై నుంచి బుధవారం ఉదయం 6:23 గంటలకు ఇస్రో చేపట్టిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. 27:30 గంటల కౌంట్‌డౌన్‌ ముగియగానే రెండోతరం నావిగేషన్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-02 (నావిక్‌-02)ను తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన రాకెట్‌.. మూడు దశలను నిరాటంకంగా పూర్తిచేసుకుని 19.12 నిమిషాల్లోనే దాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌.. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇదే మొదటి ప్రయోగం. శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో ఉన్న 1,250 కిలోల ఇంధనాన్ని దశలవారీగా మండిస్తూ, భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి దాన్ని ప్రవేశపెడుతారు.


నావిగేషన్‌ వ్యవస్థ బలోపేతం దిశగా..

ఎన్‌వీఎ్‌స-02.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌, సేవలు, వ్యవసాయంలో సాంకేతికత, మొబైల్‌ లోకేషన్‌ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఇప్పటికే అందుబాటులో ఉండగా... దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌ సిరీస్‌ కొత్త ఉపగ్రహాలు దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్‌-బ్యాండ్‌, కె-బ్యాండ్‌, కేయూ-బ్యాండ్‌ లాంటి ఉపకరణాలను అమర్చారు. రెండోతరం నావిగేషన్‌ సిరీస్‌ ఉపగ్రహాలైన నావిక్‌-01, నావిక్‌-02లో ఎల్‌-1, ఎల్‌-5, ఎస్‌-బ్యాండ్‌ సిగ్నల్‌ వ్యవస్థను అమర్చారు. ఎల్‌-1లో ప్రజలకు ఉపయోపడే సివిలియన్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ ఉంటుంది. భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం ఈ కొత్తతరం ఉపగ్రహాల ప్రత్యేకత. భారతదేశ సరిహద్దుల ఆవల 1,500 కిలోమీటర్ల పరిధి వరకూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది.


2 నెలల్లో నిసార్‌ ప్రయోగం

నావిక్‌-02 ప్రయోగం విజయానంతరం షార్‌లోని మీడియా సెంటర్‌లో సహచర శాస్త్రవేత్తలతో కలిసి నారాయణన్‌ మీడియాతో మాట్లాడారు. నావిక్‌-02 పదేళ్లపాటు సేవలందిస్తుందని వివరించారు. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్‌ ఉపగ్రహాన్ని మరో 2నెలల్లో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా ప్రయోగిస్తామని నారాయణన్‌ వెల్లడించారు. కాగా, శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

100 షార్‌లో ఇస్రోకిది వందో ప్రయోగం.

62 ఇస్రో 100 మిషన్లలో పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ద్వారా

చేపట్టిననే ప్రయోగాలే 62 ఉన్నాయి. జీఎ్‌సఎల్వీ

(17), ఎల్‌వీఎం3 (7), ఎస్‌ఎ్‌సఎల్వీ (3) ఆ తర్వాతి

స్థానాల్లో ఉన్నాయి.


ఐదేళ్లలో 100 మిషన్లు సాధ్యమే!

100 మిషన్ల మైలురాయిని చేరుకోవడానికి ఇస్రోకు దాదాపు ఐదు దశాబ్దాలు (46 ఏళ్లు) పట్టింది. ఇది చాలా ఎక్కువ కాలమే..! 1979లో షార్‌లో తొలి ప్రయోగాన్ని చేపట్టినప్పుడు ఇస్రో వద్ద ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. రాకెట్‌ టెక్నాలజీ కోసం రష్యా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఇస్రో వంద మిషన్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అత్యాధునిక టెక్నాలజీని ఇస్రో అందిపుచ్చుకుంది. సొంతంగా రాకెట్లు, ఇంజన్లు నిర్మించుకుంటోంది. ఈ క్రమంలో 2000వ సంవత్సరం నుంచి దూకుడు పెంచింది. ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో మరో వంద ప్రయోగాలు నిర్వహించి 200 మార్కు అందుకోగలమని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ అన్నారు. సైకిల్‌, ఎడ్లబండిపై రాకెట్‌ విడిభాగాలను తరలించిన కాలం నుంచి.. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను డాకింగ్‌ చేసే స్థాయికి ఇస్రో ఎదిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, రోవర్‌ను దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ను కూడా చేపట్టింది. త్వరలోనే చంద్రుడిపైకి మన వ్యోమగామిని పంపే ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - Jan 30 , 2025 | 05:23 AM