Share News

IDPL Faces Land Encroachment: 4000కోట్ల ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:29 AM

రాజధాని హైదరాబాద్‌ దేశానికే ఫార్మా క్యాపిటల్‌గా ఎదగడానికి మూలమైన ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఐడీపీఎల్‌ భూములు కబ్జాకు గురవుతున్నాయి...

IDPL Faces Land Encroachment: 4000కోట్ల  ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం

  • కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మరికొందరు బడాబాబులపై ఆరోపణలు

  • తనకు అడ్డొస్తే టిప్పర్‌తో తొక్కించేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన

  • ఐడీపీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా

  • ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు

  • ఇంత జరుగుతున్నా.. పట్టించుకోని కేంద్రం

  • ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): రాజధాని హైదరాబాద్‌ దేశానికే ఫార్మా క్యాపిటల్‌గా ఎదగడానికి మూలమైన ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌) భూములు కబ్జాకు గురవుతున్నాయి! విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన పరిశ్రమకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన భూములను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేసేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు! పేదలను ముందుపెట్టి.. ఆ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని.. రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు! ‘అయ్యా.. ఐడీపీఎల్‌ భూములు కబ్జాకు గురవుతున్నాయి.. వాటిని కాపాడండి’ అంటూ.. రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్‌ దాకా.. స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా ఎంతో మందికి.. సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు. 1961లో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడిన ఐడీపీఎల్‌కు మూసాపేట, బాలానగర్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ మండలాల పరిధిలో 902 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలక్రమంలో ఆ పరిశ్రమ మూతపడింది. నగరం విస్తరించే క్రమంలో.. ఐడీపీఎల్‌ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది! దీంతో ఆ భూములపై ఎమ్మెల్యే కన్ను పడిందని.. ఆయనకు మరికొందరు బడాబాబులు, చోటామోటా నేతలు కూడా తోడై.. ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జాకు గురై చేతులు మారినట్టు సమాచారం! వాటి విలువ దాదాపు రూ.4000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ దందాలో ఐడీపీఎల్‌కు చెందిన కొంత మంది ఉన్నతోద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం. పైకి ఆ భూముల్ని కాపాడుతున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్టు తెలిసింది. ఈ కబ్జాలు, విక్రయాల గురించి తెలిసినా.. ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం, పరిశ్రమను మూసివేసిన కేంద్రం.. భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.


ఆనవాళ్లు చెరిపేస్తూ..

ఐడీపీఎల్‌ భూములను కబ్జా చేస్తున్నవారు.. ఆ భూముల్లో కొత్తగా రోడ్లు వేయించడం, డ్రైనేజీలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. అక్కడ అసలు పాత ఆనవాళ్లేవీ కనపడకుండా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు.. రైల్వే శాఖ నిర్మించిన ట్రాక్‌ను సైతం లేకుండా చేయడం గమనార్హం. పరిశ్రమలో తయారు చేసిన ఔషధాలను ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఐడీపీఎల్‌ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఒక ట్రాక్‌ వేసింది. కానీ.. ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ట్రాక్‌ ఆనవాళ్లే లేవు. ఇటీవల గూడ్స్‌ బోగీల పార్కింగ్‌కు ఐడీపీఎల్‌ ట్రాక్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని భావించి పరిశీలనకు వచ్చినరైల్వే శాఖ అధికారులు.. అక్కడ అసలు ట్రాకే కనిపించక బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ ట్రాక్‌ ఉన్న ప్రాంతంలో ఓ కాలనీ ఏర్పడింది. ట్రాక్‌ మీద సీసీరోడ్లు వచ్చేశాయి. అక్కడ సుమారు 80 ఎకరాల దాకా భూమి అన్యాక్రాంతం అయి ఉంటుందని ఐడీపీఎల్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఐడీపీఎల్‌ భూములను.. 2019 నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి, అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు వెళితే.. టిప్పర్‌తో తొక్కి చంపించేస్తానంటూ ఆయనహెచ్చరించారని ఆరోపిస్తున్నారు. అలాగే.. బాలానగర్‌ డిమార్ట్‌ వెనుక సబ్‌స్టేషన్‌ను ఆనుకునే ఐడీపీఎల్‌ భూమి ఉంది. అక్కడ 20 ఎకరాలను కబ్జా చేసి రియల్లర్లకు కట్టబెట్టినట్టు సమాచారం. ఐడీపీఎల్‌ భూముల కబ్జాపై కొందరు ఉద్యోగులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. సదరు ఎమ్మెల్యే తన బినామీలతో ఆ ఉద్యోగులపైనే తిరిగి ఫిర్యాదులు చేయించి.. వేధింపులకు పాల్పడినట్టు చెబుతున్నారు.


ఎన్ని లేఖలు రాసినా..

  • ఐడీపీఎల్‌ భూములను కాపాడాలని కోరుతూ ఫిర్యాదులు అందినా అధికారులు స్పందించలేదు.

  • కబ్జాదారులు ప్రైవేటు సర్వేయర్లతో కలిసి భూములు పంచుకుంటున్నారని తెలుపుతూ 2017జూన్‌ 3న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

  • ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పంత్‌ 2017 అక్టోబరు 23న అప్పటి కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి లేఖ రాశారు.

  • రూ.100 కోట్ల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ ఐడీపీఎల్‌ అధికారులు 2018 మే 15న పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. మరో 14 ఎకరాలు కబ్జా చేశారని తెలుపుతూ ఐడీపీఎల్‌ ఉద్యోగులు 2018 జూలై 7న కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆక్రమణల నుంచి సంస్థ భూములను కాపాడాలని ఐడీపీఎల్‌ ప్లాంట్‌ ఇన్‌చార్జిగా ఉన్న కేఎ్‌సఎన్‌ రాజు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌, డీజీపీకి 2018 జూలై 9న లేఖలు రాశారు.

  • కూకట్‌పల్లి సర్వే నంబరు 376లో ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి అని.. తహసీల్దార్‌ తప్పు నివేదిక ఇచ్చారంటూ 2020 జనవరి 24న అప్పటి ఆర్డీవో కలెక్టర్‌కు లేఖ రాశారు.

  • ఐడీపీఎల్‌ భూములను కాపాడాలని ఆ సంస్థ అధికారులు మేడ్చల్‌ కలెక్టర్‌కు 2021 సెప్టెంబరు 13న లేఖ రాశారు.

  • కూకట్‌పల్లి సర్వే నంబరు 376లో 16 ఎకరాలను ఆక్రమించుకున్నారని తెలుపుతూ ఐడీపీఎల్‌ ఉద్యోగులు 2021 డిసెంబరు 16న బాలానగర్‌ సీఐకి లేఖ రాశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. 2021 డిసెంబరు 20న ఇవే అంశాలతో జిల్లా కలెక్టర్‌కు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కూడా లేఖ రాశారు.

  • ఐడీపీఎల్‌కు చెందిన 4 ఎకరాల్లో లే-అవుట్‌ వేసి రోడ్లు నిర్మించారని..దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ 2022 ఫిబ్రవరి 14న ఉద్యోగులు కలెక్టర్‌కు లేఖ రాశారు.

  • సర్వేనంబరు 376లో నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులు లేవని.. ఆర్టీఐ కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారులు సమాధానమిచ్చారు.

  • ...ఇలా ఎన్ని లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేదు. పోలీసులు సైతం కబ్జాదారులకే వంత పాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవర్‌ ల్యాప్‌ పేరుతో ఐడీపీఎల్‌ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని పరిశ్రమ ఉద్యోగులు.. పేదల భూములను పరిశ్రమ భూములుగా చూపుతూ కేసులు పెడుతున్నారని ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సర్వే చేయించాలని, అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడాలని ఉద్యోగులు కోరుతున్నారు.


1.jpg

పేదల జోలికి వస్తే ఊరుకోం

ఇంద్రా నగర్‌ భూములు వారివే అయితే ఐడీపీఎల్‌ వాళ్లను తీసుకోమనండి. ఆ భూముల్లో 70 ఏళ్ల నుంచి గుడిసెలున్నాయి. ఇళ్లు కట్టాం. ఇయాల పుట్టింది కాదు. రేవంత్‌ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి ఇచ్చారు. నేనూ రూ.3 కోట్లు జీహెచ్‌ఎంసీ నిధులు తెచ్చి రోడ్లు వేయించా. దాన్ని ఆక్రమణ అనరు. పేదల గురించి నేను కొట్లాడతా. భూములు ఆక్రమిస్తే.. ఆక్రమించిన వారిపైన ఐడీపీఎల్‌ వాళ్లను కొట్లాడమనండి. ఇంద్రా నగర్‌లో 1600 గుడిసెలున్నాయి. అది వారి సొంత భూమి. ఆ భూములు ఐడీపీఎల్‌వి కావు. పరిశ్రమకు చెందిన 16 ఎకరాల కబ్జా మీద నేను కూడా పిర్యాదు చేశా. అది ఐడీపీఎల్‌ భూమి అని గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు చేశా. సర్వే నంబరు 20, 21, 22 కూకట్‌పల్లిలో ఓవర్‌ ల్యాపింగ్‌ భూమి.. కవిత భర్త పేరిట ఉందని నిన్న నేను చెప్పా. ఆమె భర్త ఫొటో కూడా మీడియాకు చూపించా. చెప్పింది ఆ భూమి గురించే. ఐడీపీఎల్‌ పరిశ్రమ వాళ్లు సర్వే అడిగితే దగ్గరుండి చేయిస్తా కదా. ఇంద్రా నగర్‌ ప్రైవేటు భూమా? పరిశ్రమదా? నవాబుల దా? తేల్చమని నేనే అడిగా. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి ఉంటే వారిని కొట్లాడమనండి.. నేను కూడా వచ్చి నిలబడతా.

- మాధవరం కృష్ణారావు,

కూకట్‌పల్లి ఎమ్మెల్యే

Updated Date - Dec 11 , 2025 | 05:29 AM