ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 10,823 మంది డుమ్మా
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:27 AM
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 కేంద్రాల్లో ద్వితీయ భాష పరీక్ష జరిగింది. మొత్తం 4,52,028 మంది విద్యార్థులకు.. 4,40,513 మంది హాజరయ్యారని ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 10,823 (2.39 శాతం) మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

విస్తృతంగా స్క్వాడ్ తనిఖీలు.. 4 మాల్‌ప్రాక్టీస్ కేసులు
తండ్రి మృతి.. దేవరకద్రలో పరీక్షకు హాజరైన కుమారుడు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 కేంద్రాల్లో ద్వితీయ భాష పరీక్ష జరిగింది. మొత్తం 4,52,028 మంది విద్యార్థులకు.. 4,40,513 మంది హాజరయ్యారని ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 10,823 (2.39 శాతం) మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షకులను పంపించామన్నారు. జగిత్యాలలో మూడు, నిజామాబాద్‌లో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని పేర్కొన్నారు. ఓ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తండ్రి మరణించిన విషయాన్ని దాచి ఇంటర్ పరీక్ష రాయించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకుంది. గద్వాల జిల్లా లింగనవాయికి చెందిన మైబుబాష కుమారుడు సమీర్ దేవరకద్రలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మైబుబాష అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
తండ్రి చనిపోయిన విషయం పరీక్ష అయ్యే వరకు సమీర్‌కు చెప్పొద్దని కళాశాల ప్రిన్సిపాల్ రహెమతుల్లాను అతడి తల్లి కోరారు. దీంతో పరీక్ష అయిపోయాక అసలు విషయం చెప్పి అతడిని ఇంటికి పంపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోని ఓ తరగతి గదిలోకి పాము చొరబడింది. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆ పామును చంపేశారు. దీంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో పరీక్ష కారణంగా పొద్దున జరగాల్సిన వివాహం మధ్యాహ్నానానికి వాయిదా పడింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (టీఎ్‌సడబ్ల్యూఆర్‌జేసీ)లో పరీక్షా కేంద్రం ఎదురుగా నివాసం ఉండే గుగులోతు కల్యాణ్ వివాహం ఉదయం 9:30 గంటలకు జరగాల్సి ఉంది. కానీ భాజాభజంత్రీల శబ్దానికి పరీక్ష రాసే విద్యార్థులకు ఆటంకం కలుగుతుందంటూ విద్యాశాఖ అధికారులు, స్థానిక ఎస్సై సదరు కుటుంబసభ్యులను సంప్రదించారు. దీంతో సదరు కుటుంబం పరీక్ష పూర్తయిన అనంతరం వివాహం జరిపించింది.