Online Fraud: ఆరోగ్యశ్రీ పేరుతో ఖాతాలు ఖాళీ చేసే.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:22 AM
ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ముల్లుంటి సలీం మాలిక్ ఢిల్లీకి చెందిన సత్యంతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. తమ ఖాతాలో ఆరోగ్యశ్రీ పేరుతో డబ్బులు జమ అయ్యాయని సలీం మాలిక్ బాధితులకు ఫోన్ చేసి తెలిపేవాడు. ఢిల్లీలో ఉన్న సత్యం ద్వారా బాధితుల ఫోన్‌కు కొన్ని లింక్‌లు పంపేవాడు. ఆ లింకును క్లిక్ చేయగానే బాధితుల ఖాతాలో ఉన్న డబ్బులు కట్ అయ్యేవి. దీనికి సహాయపడిన సత్యంకు సలీం మాలిక్ కొంత డబ్బులు పంపించేవాడు.
ఇదేవిధంగా మోసపోయిన జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జిల్లా సైబర్ బృందంతో కలిసి పోలీసులు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు సలీం మాలిక్‌ను హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 79 ఫిర్యాదులు ఉన్నాయని, వారు సుమారు 60 లక్షల రూపాయలకు పైగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు.