RTI Act violations: సమాచార కమిషనర్లుగా పార్టీ వాళ్లా
ABN , Publish Date - May 02 , 2025 | 05:38 AM
సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ జరిగినట్లు 'సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ' ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్ రాజు ఆరోపించారు. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని నియమించారంటూ గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక..
గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న హక్కుల కార్యకర్త
పంజాగుట్ట, మే 1 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ జరిగిందని.. స్ర్కీనింగ్ కమిటీ సూచించిన వారిని కాకుండా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేశారని ‘సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ’ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్ రాజు ఆరోపించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయి సెలక్షన్ కమిటీ లేకుండానే సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ జరిగిందని.. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని చెప్పారు. ఏ పార్టీకీ అనుకూలంగా ఉన్న వారిని నియమించవద్దనే నిబంధనలను తోసిపుచ్చి.. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. అందులో ఒకరు గాంధీభవన్ పీఆర్వోకాగా, మరొకరు సీఎం కార్యాలయంలో సీపీఆర్వో, ఇంకొకరు ఒక పార్టీకి సంబంధించిన వారని.. వారిని సమాచార కమిషనర్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఈ అంశంలో గవర్నర్ స్పందించాలని, ప్రభుత్వం పంపించిన పేర్లను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
For Telangana News And Telugu News