Suryapet: ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రసాభాస
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:48 AM
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. నెమ్మికల్ గ్రామంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మైక్ లాక్కున్న మార్కెట్ చైర్మన్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల తోపులాట
ఆత్మకూరు(ఎస్), ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. నెమ్మికల్ గ్రామంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందిందని, నదులను అనుసంధానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వడంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందని అన్నారు. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుచెబుతూ వాదనకు దిగారు. తెలంగాణ ఉద్యమం పేరుతో బీఆర్‌ఎస్ పార్టీ వందల మంది ప్రాణాలను బలిగొందని, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని విమర్శలకు దిగారు.
అదే సమయంలో వేణారెడ్డి కలుగజేసుకుని, కాళేశ్వరం కాదది కూలేశ్వరం అని, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఆత్మకూర్(ఎస్) మండలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శిస్తూ జగదీశ్‌రెడ్డి నుంచి మైక్‌ను లాక్కున్నారు. దీంతో జగదీశ్‌రెడ్డి మరో మైక్‌ను తీసుకుని విమర్శలకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటకు దిగారు. కలెక్టర్ కలుగజేసుకుని ఇది రాజకీయ వేదిక కాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వేదికని సర్దిచెప్పారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.