Share News

Nalgonda traffic: జాతీయ రహదారులపై వాహనాల రద్దీ

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:18 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ఆదివారం వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్‌-వరంగల్‌ 163వ జాతీయ రహదారి, విజయవాడ-హైదరాబాద్‌ 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

Nalgonda traffic: జాతీయ రహదారులపై వాహనాల రద్దీ

  • కొర్లపహాడ్‌, పంతంగి, గూడూరు టోల్‌గేట్ల వద్ద వాహనాల బారులు

  • చిట్యాల నుంచి చౌటుప్పల్‌కు గంట సమయం

బీబీనగర్‌/కేతేపల్లి/చౌటుప్పల్‌ టౌన్‌/చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ఆదివారం వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్‌-వరంగల్‌ 163వ జాతీయ రహదారి, విజయవాడ-హైదరాబాద్‌ 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు గురు, శుక్రవారాల్లో తరలివెళ్లారు. సెలవులు ముగిసి సోమవారం విధులకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ వద్ద గల టోల్‌ప్లాజాలోని కౌంటర్ల వద్ద సెన్సార్లు వేగంగా పని చేయకపోవడం, రెండు టోల్‌ కౌంటర్లు మూసి ఉండడంతో ఇక్కడ వాహనాలు బారులు తీరాయి.


సాధారణ రోజుల్లో 10 నుంచి 12 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం 20 వేల వాహనాలు ప్రయాణించాయి. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజాను దాటేందుకు ఒక్కో వాహనానికి ఏడు నిమిషాల సమయం పట్టింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఇక్కడ వాహనాల ప్రయాణం ఆలస్యమైంది. చిట్యాల నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటుప్పల్‌కు వెళ్లేందుకు గంట సమయం పట్టిందని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ఆదివారం 38 వేల వాహనాలు వెళ్లాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్‌-వరంగల్‌ 163వ జాతీయ రహదారిపైనా వాహనాల రద్దీ పెరిగి బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 05:19 AM