Share News

Iccampalli Reservoir: రిజర్వాయర్‌ఇచ్చంపల్లిలోనే

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:21 AM

గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సమాంతరంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

Iccampalli Reservoir: రిజర్వాయర్‌ఇచ్చంపల్లిలోనే

గోదావరి-కావేరి అనుసంధానం కోసం నిర్మించాలి

  • అక్కడి నుంచే 200 టీఎంసీల తరలింపు.. ఇచ్చంపల్లికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం

  • సీఎంల భేటీలో ఎజెండాగా చేర్చాలని లేఖ.. 100 మీటర్లతో నిర్మిస్తే మేడిగడ్డకు ప్రత్యామ్నాయం

  • గతంలో అభ్యంతరం తెలిపినా.. గోదావరి-బనకచర్లకు కౌంటర్‌గా తాజాగా తెరపైకి!

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సమాంతరంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ నుంచే గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని, ఈ రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి 200 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా అవసరమైన ఆర్థిక సహాయం ఏఐబీపీ/పీఎం కేఎ్‌సవై నుంచి చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ నిర్వహించే సమావేశపు ఎజెండాలో దీనిని చేర్చాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ కూడా రాశారు. ఇచ్చంపల్లిపై ప్రభుత్వం నెల రోజులుగా సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా గోదావరిపై ఎగువన తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే తమకు అభ్యంతరాల్లేవని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. మరోవైపు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద ఏకంగా 200 టీఎంసీలను తరలించడానికి వీలుగా ఏపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాకుండా పోలవరం నుంచే గోదావరి-కావే రి అనుసంధానం చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి కూడా చేస్తోంది. దాంతో ఏపీ ప్రయత్నాలను అడ్డుకోకపోతే గోదావరి-కావేరి అనుసంధానం కూడా తెలంగాణ చేజారే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గోదావరి-కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదిస్తోంది. అయితే గత ప్రభుత్వం సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) నుంచి చేపట్టడానికి సమ్మతి తెలిపింది.

మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా..

ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ను 95 నుంచి 100 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే.. బ్యాక్‌ వాటర్‌ కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ హెడ్‌కు తగులుతుంది. అప్పుడు ఆ నీటిని అన్నారంలోకి, అక్కడి నుంచి సుందిళ్లకు, అటునుంచి ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 195 టీఎంసీల నీటిని ఇలా తరలించాలని యోచించిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, దాని పునరుద్ధరణ అంత తేలిగ్గా అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. బ్యారేజీ ఏడో బ్లాకులోని 11 పిల్లర్లలో రెండు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. దానిని పునరుద్ధరించాలంటే మొత్తం బ్లాకును తొలగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో రక్షణ చర్యలకు భారీగానే నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో 195 టీఎంసీల నీటిని ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే నీటిలో వాటా నుంచి 42 టీఎంసీలను కేటాయించడానికి కేంద్రం సమ్మతి తెలుపడంతో రెండు రిజర్వాయర్లు నిర్మించుకోవాలని తెలంగాణ యోచిస్తోంది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని గతంలోనే కోరింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ కూడా ఒక ఎజెండాగా చేర్చాలని విజ్ఞప్తి చేసింది.

కాటన్‌ గుర్తించినా..

గోదావరి-ఇంద్రావతి సంగమ ప్రాంతంలో ఇచ్చంపల్లి ఉంది. ధవళేశ్వరం(కాటన్‌) బ్యారేజీ నిర్మించే క్రమంలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌కు అనుకూలత ఉందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గుర్తించారు. అప్పట్లో పరిశోధనలు కూడా చేశారు. అయితే నిర్మాణం చేపట్టే క్రమంలో కార్మికులంతా మలేరియా వ్యాధి బారిన పడటంతో ఇచ్చంపల్లిని వీడారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీటిని అందించడానికి వీలుగా 1980లోనే 118 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతినిచ్చింది. కానీ, 118 మీటర్ల ఎత్తుతో కడితే భారీగా ముంపు ఉంటుందని దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. అనంతరం మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర అభ్యంతరాలతో ఈ బ్యారేజీ ఎత్తును 112 మీటర్లకు తగ్గించుకున్నారు. ఇందుకు మహారాష్ట్ర అంగీకరించగా.. మధ్యప్రదేశ్‌ మళ్లీ అభ్యంతరం తెలిపింది. దాంతో 1986-88లో 108 మీటర్లకు కుదించుకున్నారు. అయితే ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్రం అభ్యంతరాలతో 105 మీటర్లకు తగ్గింది. కానీ, 105 మీటర్ల పైన బ్యారేజీ కడితేనే గ్రావిటీ ద్వారా నీటిని తరలించడానికి అవకాశం ఉంటుందని, దాని కిందికి కడితే లిఫ్టింగ్‌ చేయాల్సిందేనని గుర్తించారు. అభ్యంతరాలతో తుదిగా 87 మీటర్ల ఎత్తుతో రిజర్వాయర్‌ నిర్మాణానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. 87 మీటర్లతో కడితే 15 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. కానీ, 100 మీటర్ల ఎత్తు కోసం కేంద్రాన్ని తెలంగాణ కోరే అవకాశాలున్నాయి.

తొలుత అభ్యంతరాలు...

ఇచ్చంపల్లిపై తెలంగాణ తొలుత అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కిలోమీటర్ల దిగువలోనే తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ ఉన్నందున.. రిజర్వాయర్‌ నుంచి నీటిని ఆకస్మికంగా విడుదల చేయాల్సి వస్తే.. ఆ వరదను నియంత్రించే పరిస్థితులు ఉండబోవని అభిప్రాయపడింది. ఫ్లడ్‌ రూటింగ్‌కు ఇబ్బందులు వస్తాయని చెబుతూ వచ్చింది. ఇచ్చంపల్లికి దిగువన 158 టీ ఎంసీల (దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు) నీటి వినియోగం ఉందని పేర్కొంది. ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ కట్టి ఏకకాలంలో గోదావరి-కావేరి అనుసంధానంతోపాటు దిగువన ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అయితే ఫ్లడ్‌రూటింగ్‌కు ఇబ్బందుల్లేవని ఇప్పటికే కేంద్రం తెలంగాణకు సమాచారం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లిపై ప్రభుత్వం తాజాగా మనసు మార్చుకుంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ను వేగంగా ఏపీ చేపడుతుండటంతో దీనికి కౌంటర్‌గా, కాళేశ్వరంలోని మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లిని ప్రభుత్వం నమ్ముకుంది. గోదావరి-కావేరి అనుసంధానంలో ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ను కడితే 90 శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. మిగిలిన 10 శాతం వ్యయాన్ని నీటి వాటా ఆధారంగా నిష్పత్తిని బట్టి ఆయా రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి) చెల్లించాల్సి ఉంటుంది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద కేంద్రం అనుమతినిస్తే మాత్రం 60ు నిధులు మాత్రమే వస్తాయి.

Updated Date - Jul 16 , 2025 | 04:21 AM