వరి సాగు విస్తీర్ణాన్ని 5 శాతం తగ్గించాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:19 AM
భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) భాగస్వామ్యంతో రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్)లో మూడు రోజులపాటు జరిగిన వరి పరిశోధకుల గోల్డెన్ జూబ్లీ సమావేశాలు సోమవారం ముగిశాయి.
ఐఐఆర్‌ఆర్ డైరెక్టర్ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) భాగస్వామ్యంతో రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్)లో మూడు రోజులపాటు జరిగిన వరి పరిశోధకుల గోల్డెన్ జూబ్లీ సమావేశాలు సోమవారం ముగిశాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన 350 మంది వరి పరిశోధకులు గత వర్షాకాలంలో చేసిన ప్రయోగాల గురించి వివరించి, వచ్చే వానా కాలంలో వాటిని ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై చర్చించారు.
ముగింపు కార్యక్రమంలో ఐఐఆర్‌ఆర్ డైరెక్టర్ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం మాట్లాడుతూ వరిసాగు విస్తీర్ణాన్ని ఐదు శాతం తగ్గించాలని, అదే సమయంలో పది శాతం వరి ఉత్పత్తులను పెంచేలా పరిశోధనలు జరగాలని సదస్సులో చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ వరి పరిశోధన సంస్థకు విశేష సేవలందించి మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న డాక్టర్ ముత్తు రామన్‌ను ఘనంగా సన్మానించారు.