Hydra: కుంటల్లో షెడ్లు కూల్చేసిన హైడ్రా
ABN , Publish Date - Jan 01 , 2025 | 03:31 AM
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రామ్‌గూడ-ఖాజాగూడ రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ కుంట, తౌటోనికుంట బఫర్‌జోన్‌లలో వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది.
ఖాజాగూడలో రోడ్డున పడ్డ కూలీలు.. నోటీసులు ఇచ్చాం: రంగనాథ్
హైదరాబాద్ ఖాజాగూడలో హైడ్రా చర్యలు
రోడ్డున పడ్డ కూలీలు.. సామగ్రి డివైడర్లపైకి
నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆధారాల్లేకుండా చర్యలా: హైకోర్టు ఆగ్రహం
హైడ్రా కమిషనర్‌ను మళ్లీ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య
వాదనలకు అవకాశమిచ్చి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రామ్‌గూడ-ఖాజాగూడ రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ కుంట, తౌటోనికుంట బఫర్‌జోన్‌లలో వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది. దీంతో.. వాటిల్లో నివాసముంటున్న కూలీలు రోడ్డునపడ్డారు. ఈ చర్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భగీరథమ్మ, తౌటోనికుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో రేకుల షెడ్లను వేసిన కొందరు వ్యక్తులు.. వాటిని కూలీలకు అద్దెకిచ్చారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా మంగళవారం ఉదయం రంగంలోకి దిగింది. 10 ఆక్రమణలను తొలగించింది. ఆ షెడ్లలో ఉంటున్న కూలీలకు తమ సామగ్రిని తీసుకోవడానికి మాత్రమే సమయం ఇవ్వడంతో.. వంటావార్పుల్లేక.. వారు రోడ్డుపక్కనే పడిగాపులుకాయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కూలీల పిల్లలు ‘‘ఆకలి’’ అంటూ దీనంగా కూర్చున్న వీడియోలు.. ఇంటి సామగ్రి కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. షెడ్ల యజమానులు వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని ముందుగానే నోటీసులు ఇచ్చామని, చెరువుల ఆక్రమణల విషయంలో ఉపేక్షించేది లేదని హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. అయితే.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని కూలీల కుటుంబాలు చెబుతున్నాయి. ఇటీవల హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ఆక్రమణల విషయంలో యజమానులతోపాటు.. అద్దెకు ఉంటున్నవారికి కూడా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. ఖాజాగూడ కూల్చివేతల విషయంలో ఆ విషయాన్ని విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘కబ్జాల్లో ఇదో ప్రణాళిక. తొలుత షెడ్లు వేస్తారు. కూలీలకు అద్దెకిస్తారు. కూల్చివేతలకు వెళ్తే.. ‘మానవత్వం’ పేరుతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. చెరువుల ఆక్రమణల విషయంలో ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం’’ అని రంగనాథ్ వ్యాఖ్యానించారు.

హైడ్రా పోలీ్‌సస్టేషన్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!
హైడ్రా ప్రత్యేక పోలీ్‌సస్టేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంబంధిత ఫైల్‌పై సంతకం కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఒకట్రెండ్రోజుల్లో హైడ్రా ఠాణాకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. హైడ్రా పోలీ్‌సస్టేషన్ ఏర్పాటైతే.. ఈ విభాగం పోలీసులకు ఇక నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కలుగుతుంది.