Harish Rao on KTR Case: కేటీఆర్ కేసుపై హరీష్ రావు రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:39 PM
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కేటీఆర్‌పై రాజకీయ కక్షసాధింపులు పరాకాష్ఠకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ నొక్కుతున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈరేస్ విషయంలో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని సెటైర్లు వేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
కాగా, ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌పై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించి కేటీఆర్‌పై విచారణకు ఇవాళ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...
రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
For More Telangana News