DRI: కార్ల పన్ను ఎగవేత కేసు.. మరో ఇద్దరిని విచారిస్తున్న డీఆర్ఐ
ABN , Publish Date - May 17 , 2025 | 10:22 AM
DRI: పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని కార్‌లాంజ్ షోరూం యజమాని బషారత్ అహ్మద్ ఖాన్‌ను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్: రూ. వంద కోట్ల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల (Luxury car) డీలర్, గచ్చిబౌలిలోని కార్‌లాంజ్ షోరూం యజమాని బషారత్ అహ్మద్ ఖాన్ (Basharat Ahmed Khan)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు (Arrest)చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బషారత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ డీలర్ బషారత్ అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ట్యాక్స్ ఎగవేత కేసులో మూడు రోజుల క్రితం బషారత్‌ను అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. పన్ను ఎగవేసినందుకు 7 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరారు. అయితే కోటి రూపాయలు చెల్లించి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఇప్పటివరకు 25 కోట్ల రూపాయల పన్నును ఎగవేసినట్లు డిఆర్ఐ గుర్తించింది. బషారత్ తెచ్చిన 30 కార్లలో 10 కార్లను హైదరాబాదు వాసులకే అమ్మినట్లు అధికారులు గుర్తించారు.
కాగా అహ్మదాబాద్‌లో నమోదైన కేసు ఆధారంగా డీఆర్ఐ అధికారులు బషారత్ అహ్మద్ ఖాన్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. అమెరికా, జపాన్‌లలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్‌కు ఖాన్ తరలించినట్టు గుర్తించారు. పన్నులు తప్పించుకోవడానికి అహ్మద్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు డీఆర్‌ఐ విచారణలో వెల్లడైంది. విదేశీ లగ్జరీ కార్ల అసలు ధరకన్నా కొన్ని సందర్భాల్లో 50 శాతం తక్కువకు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారని, కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసేందుకు అమెరికాలో కొన్న కారును శ్రీలంక ద్వారా భారత్‌కు తీసుకొచ్చేవారని అధికారులు తెలిపారు.
Also Read: రీశాట్-1బీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
అహ్మద్‌తోపాటు అతని వ్యాపార భాగస్వాములు ఇలా దేశంలోకి వచ్చిన కార్లను అహ్మదాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దాచినట్టుగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు బషారత్ అహ్మద్ ఖాన్ వద్ద కార్లు కొనుగోలు చేశారని, వాటిలో కొన్ని కార్లను పూర్తిగా నగదు చెల్లించి కొన్నట్టుగా అనుమానిస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. అమెరికా, జపాన్‌లో కొన్న ఖరీదైన లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను శ్రీలంకకు తరలించాక అక్కడ భారత్‌లో వాడేందుకు వీలుగా రైట్ హ్యాండ్ డ్రైవ్‌కు మార్చడమేకాకుండా దీనికి అనుగుణంగా పత్రాలు సృష్టించినట్టు చెప్పారు. దాదాపు 30 కార్లను ఈ విధంగా ఖాన్ తెప్పించారని, ఈ కార్లను కొన్న పలువురు పన్ను ఎగవేతలో భాగస్వాములైన క్రమంలో వారిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
కాగా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఖాన్ దాదాపు 10 ఏళ్ల నుంచి షోరూమ్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఎనిమిది వాహనాల దిగుమతితో ప్రభుత్వానికి రూ.7 కోట్ల వరకు కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు తేలింది. అయితే ఆయన దిగుమతి చేసిన కార్లను తన ఫామ్ హౌస్‌లో దాచేందుకు డాక్టర్ అహమద్ అనే బిజినెస్ భాగస్వామి సహాయం చేసేవాడని అధికారులు తేల్చారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఖాన్ కొందరు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను అండగా వాడుకున్నాడని తెలుస్తోంది. పైగా పన్ను అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు చాలా మంది కస్టమర్ల నుంచి డబ్బు రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేసినట్లు తేలింది. ఖాన్ వ్యాపారం కేవలం హైదరాబాదుకు పరిమితం కాలేదని ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీల్లో విస్తరించిందని డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక
For More AP News and Telugu News