BC Reservation Bill: బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:57 PM
బీసీ రిజర్వేషన్ బిల్లుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మరో మోసానికి కుట్ర లేపిందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 23: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మరో మోసానికి తెర లేపిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణలో కులగణన ఎక్కడా సరిగ్గా జరగలేదన్నారు. కుల గణన సరిగ్గా జరగలేదని మరోసారి చేశారని.. అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. డెడికేషన్ కమిషన్ వివరాలు సైతం పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని చెప్పారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరుకాలేదని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో దాసోజ్ శ్రవణ్‌తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ బిల్లు అమలు కాకుండానే రేవంత్ సర్కార్ జీవో తెచ్చిందంటూ మండిపడ్డారు. బీసీల జీవోను కోర్టులో కొట్టేశారని తెలిపారు. శనివారం జీవో 46ను విడుదల చేశారని.. కానీ ఇది స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు చెల్లదని కుండ బద్దలు కొట్టారు.
బీసీలను నమ్మించి.. తడి గుడ్డుతో గొంతు కోశారు: దాసోజు
రేవంత్ సర్కార్ బీసీలను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోశారని దాసోజ్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. డెడికేషన్ కమిషన్ ద్వారా కుల గణన చెయ్యాలి కానీ ఈ ప్రభుత్వం అలా చెయ్య లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చిందని.. మరి మీరు ఏం సాధించారంటూ అధికార పార్టీ నేతలకు దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు. బిల్లులు, ఆర్డినెన్సుల పేరుతో నాటకాలు.. బయట పెయిడ్ బ్యాచ్‌తో పూలాభిషేకాలు చేయడం మీకే చెల్లిందంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పుడు జీవో 46 తీసుకొచ్చి మరో సారి బీసీలను మోసగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.