Share News

Hyderabad to Build Iconic: గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:56 AM

రాజధాని నగరం ఓఆర్‌ఆర్‌పైన గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో అత్యంత ఎత్తైన ఐకానిక్‌ టవర్‌ను......

Hyderabad to Build Iconic: గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌

  • అత్యంత ఎత్తుగా ఐకానిక్‌ టవర్‌

  • హిమాయత్‌సాగర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై హైదరాబాద్‌ స్వాగత తోరణం

  • ఓఆర్‌ఆర్‌కు ఓవైపు ఎకోథీమ్‌పార్కు, మరోవైపు ఐకానిక్‌ టవర్‌

  • తాగునీరు, వరదనీరు నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవనం

  • రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా పనుల్లో వేగం పెంచాలి

  • మూసీ అభివృద్ధి పనులపై సమీక్షలో అధికార్లకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం ఓఆర్‌ఆర్‌పైన ‘గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌’ పేరుతో అత్యంత ఎత్తైన ఐకానిక్‌ టవర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో పురపాలక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మూసీ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్‌ ముఖద్వారం ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీన్ని హిమాయత్‌ సాగర్‌ గాంధీ సరోవర్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌పై ‘గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌’గా నిర్మించాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఎకో థీమ్‌పార్క్‌ అభివృద్ధి చేసి, మరో వైపున బాపూ ఘాట్‌ దిశగా భారీ ఐకానిక్‌టవర్‌ నిర్మించాలని.. అందుకు తగిన డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాంతాలకు పర్యాటకులు చేరుకునేలా ఎలివేటెడ్‌ గేట్‌వే నిర్మించి దాన్ని గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌గా డిజైన్‌ చేయాలని ఆదేశించారు. బాపూఘాట్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆకట్టుకునేలా డిజైన్‌ చేయాలన్నారు. హిమాయత్‌ సాగర్‌ వద్ద అప్రోచ్‌రోడ్డు నుంచి అత్తాపూర్‌ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్‌ వంతెన నిర్మించాలని, గాంధీ సరోవర్‌ చుట్టూ ఈ వంతెన కనెక్టివ్‌ కారిడార్‌లా ఉండాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా కనెక్టివిటీ ఉండాలని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్‌ వద్ద నిర్మించే ఐకానిక్‌ టవర్‌ ప్రపంచంలోనే ఎత్తైనదిగా ఉండాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను సీఎం నిర్దేశించారు.


తాగు, వరద నీటి నిర్వహణకు అనుగుణంగా..

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో చేపట్టే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలు ఉండేలా అత్యంత అధునాతనంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం పనులు తాగునీటితోపాటు వరద నీటి నిర్వహణకు వీలుగా ఉండాలని, ఈ మేరకు వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టుల నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నీటిని హైదరాబాద్‌ నగర అవసరాలు తీర్చేందుకు వీలుగా మరింత సమర్థవంతంగా వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్థలం వృథా కాకుండా.. మూసీ పరివాహక ప్రాంతం ఇరువైపులా భూగర్భంలో భారీగా నీటి నిల్వ సదుపాయాలను నిర్మించటం, అక్కడి నుంచి నీటిని తరలించటానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల్లో వేగం పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 10 , 2025 | 05:29 AM