Mount Everest Climbing: 16 ఏళ్లకే ఎవరెస్ట్ ఎక్కిన విశ్వనాథ్ కార్తికేయ
ABN , Publish Date - May 28 , 2025 | 05:15 AM
హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ‘7 సమ్మిట్ అడ్వెంచర్’ పూర్తి చేశాడు. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కార్తికేయ చరిత్ర సృష్టించాడు.
ప్రపంచంలోనే ఎత్తయిన 7 శిఖరాలు ఎక్కిన హైదరాబాదీ
’7 సమ్మిట్ అడ్వెంచర్’ పూర్తి చేసిన తొలి భారతీయుడు
హైదరాబాద్ / బోయినపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను విశ్వనాథ్ కార్తికేయ పడకంటి అనే యువకుడు 16 ఏళ్లకే అధిరోహించాడు. దీంతో ప్రపంచంలోని 7 ఖండాల్లో అత్యంత ఎత్తయిన ఏడు శిఖరాలను అధిరోహించి ’7 సమ్మిట్ అడ్వెంచర్’ పూర్తి చేశాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కుడిగా, తొలి భారతీయునిగా విశ్వనాఽథ్ చరిత్ర సృష్టించాడు. నగరంలోని బాలానగర్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయకు చిన్నప్పటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి ఉండేది. ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో ఐదేళ్లుగా భారత సైన్యంలో సేవలందించిన మౌంటెనీర్ రోమిల్ బార్త్వాల్ వద్ద శిక్షణ పొందాడు. పట్టుదలతో పర్వతారోహణ ప్రారంభించిన విశ్వనాథ్ ఐదేళ్లలో శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లను తట్టుకుని ఇప్పటివరకు 23 శిఖరాలు అధిరోహించాడు. అయితే గత సంవత్సరమే ఎవరెస్ట్ అధిరోహించాలని భావించిన 16 సంవత్సరాలు నిండాలి అనే నిబంధనతో వీలు కాలేదు. ఈ సంవత్సరం ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యంతో ఏప్రిల్ 7న హైద్రాబాద్ నుంచి బయలుదేరిన విశ్వనాథ్ నేపాల్‌లోని కాఠ్మాండూ చేరుకుని అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ నెల 18న ఎవరెస్ట్ సాహసయాత్రను ప్రారంభించిన విశ్వనాథ్‌కు శిఖరంపైకి చేరుకోవడానికి పది రోజుల సమయం పట్టింది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మంగళవారం ఉదయం విశ్వనాథ్ మరో ముగ్గురితో కలిసి ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నాడు.