GHMC: 5 నెలలు.. రూ.760 కోట్లు!
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:50 AM
హైదరాబాద్ మహానగర స్థిరాస్తి రంగంలో పురోగతి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీ, తద్వారా సంస్థకు వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది.
జీహెచ్‌ఎంసీకి పెరిగిన భవన నిర్మాణ అనుమతుల ఆదాయం
గతేడాదితో పోలిస్తే 90% అధికం
గాడినపడుతున్న ‘రియల్’ రంగం
క్రయ విక్రయాల్లో వృద్ధి
కొత్త ప్రాజెక్టులకు దరఖాస్తులు
అనుమతుల జారీలో పెరిగిన వేగం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర స్థిరాస్తి రంగంలో పురోగతి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీ, తద్వారా సంస్థకు వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు భవన నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీ (ఓసీ) ద్వారా రూ.399.61 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అదే కాలానికి రూ.759.98 కోట్ల ఆదాయం సమకూరిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో బల్దియా పేర్కొంది. 90 శాతం పెరుగుదల ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4,389 భవన నిర్మాణ అనుమతులు, 1,008 ఓసీలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీకి ఆస్తి పన్ను, నిర్మాణ అనుమతుల రుసుము ప్రధాన ఆదాయ వనరులు. గత ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు) రూ.2 వేల కోట్లకుపైగా ఆస్తి పన్ను వసూలు కాగా.. పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా రూ.1138.44 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో కేవలం రూ.399.61 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు వచ్చిన రూ.738.83 కోట్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.1138.44 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి) మొదటి ఐదు నెలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.759.98 కోట్లు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగం గాడిన పడుతోందని, క్రయ విక్రయాలు పెరగడం వల్లే నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. అదే సమయంలో ఇండిపెండెంట్, ఐదు అంతస్తుల్లోపు భవనాల నిర్మాణంలోనూ పెరుగుదల కనిపిస్తోంది.
అనుమతుల జారీలో వేగం
భవన నిర్మాణ అనుమతుల జారీకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి బిల్డ్ నౌ విధానం అమలు చేస్తున్నారు. బిల్డ్ నౌలో ప్లాన్ పరిశీలన నిమిషాల వ్యవధిలో పూర్తవుతుండగా సింగిల్ విండో ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర విభాగాలకు దరఖాస్తు వెళుతోంది. భూమి యజమాన్య హక్కు, చెరువులు, నాలాలు, కుంటల పక్కన స్థలం లేకుంటే ఎన్‌వోసీ ఇస్తున్నారు. దీంతో భవన నిర్మాణాల అనుమతుల జారీలో వేగం పెరిగిందని బల్దియా వర్గాలు చెబుతున్నాయి.