Hyderabad Police: హైదరాబాద్ పరిధిలో..100 మంది ట్రాఫిక్ మార్షల్స్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:59 AM
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దింపారు.
రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణే వారి పని శిక్షణ ఇచ్చి విధుల్లోకి
సీఎ్‌సఆర్‌లో భాగంగా జీతం ఇవ్వనున్న కార్పొరేట్ సంస్థలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దింపారు. సీఎ్‌సఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) పాలసీలో భాగంగా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ విధులు, వాహనాల క్రమబద్ధీకరణపై శిక్షణ పొందిన ఆ మార్షల్స్‌కు. ట్రాఫిక్ పోలీస్ హోంగార్డులు ధరించే యూనిఫాంనే కేటాయించినట్లు సీపీ తెలిపారు. వారికి రూ.20 వేలు జీతంగా నిర్ణయించామని.. కార్పొరేట్ సంస్థలే వారికి ఆ జీతాన్ని చెల్లిస్తాయన్నారు.
మార్షల్స్ అందరూ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో పర్యవేక్షణ, సూచనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని.. తమకు అప్పగించిన విధులు మాత్రమే నిర్వర్తించాలని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ విధుల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, ఎంజే స్కూల్, నిలోఫర్ కేఫ్, సిద్ధార్థ జువెలర్స్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, షా గౌస్ కేఫ్, మహావీర్ ఎస్టేట్స్ వంటి సంస్థల నుండి ఈ కార్యక్రమానికి బలమైన మద్దతు లభించిందన్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే.. తద్వారా ట్రాఫిక్ మార్షల్స్ సంఖ్య 500 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.