Share News

Human Trafficking: 3 సార్లు అండాలు ఇస్తే 30వేలు!

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:26 AM

మూడు సార్లు అండాలు ఇస్తే రూ.30వేలు, సరగసీ ద్వారా పిల్లల్ని కనిస్తే రూ.4లక్షలు.. ఇస్తామంటూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే లక్ష్యంగా లక్ష్మీరెడ్డి దందా సాగినట్లు పోలీసులు గుర్తించారు.

Human Trafficking: 3 సార్లు అండాలు ఇస్తే 30వేలు!

  • బిడ్డను కనిస్తే 4లక్షలు ఇస్తామంటూ ఎర

  • ఫర్టిలిటీ కేంద్రాలతోనూ ముందస్తు ఒప్పందాలు

  • లక్ష్మీరెడ్డి కేసులో విస్తుపోయే అంశాలు

  • ఫర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు

హైదరాబాద్‌ సిటీ/పేట్‌ బషీరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మూడు సార్లు అండాలు ఇస్తే రూ.30వేలు, సరగసీ ద్వారా పిల్లల్ని కనిస్తే రూ.4లక్షలు.. ఇస్తామంటూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే లక్ష్యంగా లక్ష్మీరెడ్డి దందా సాగినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన అద్దె గర్భం దందా కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి అలియాస్‌ లక్ష్మి, ఆమె కొడుకు నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిలుకలూరిపేటకు చెందిన నరెద్దుల లక్ష్మీ రెడ్డి అలియాస్‌ లక్ష్మి(45)పై 2024లో ముంబై పోలీసులు ఆమెపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న ఆమె.. మాదాపూర్‌, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ కేంద్రాలను సంప్రదించి, అండాలు కావాలన్నా, సరోగసికి మహిళలు కావాలన్నా తాను ఏర్పాటు చేస్తానంటూ ఒప్పందాలు చేసుకుంది. తన కొడుకు, కూతురే ప్రధాన ఏజెంట్లుగా మారి, పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి.. దందాలోకి లాగేవారని తేలింది. రహస్యంగా అద్దె గర్భాల దందాను నిర్వహిస్తున్న లక్ష్మీరెడ్డి.. ఆమె ఇంటిలోని మొదటి అంతస్థును బ్యాచిలర్స్‌కే అద్దెకివ్వడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వారి వీర్యాన్ని ఏమైనా సేకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లక్ష్మిరెడ్డి దందాతో సంబంధం ఉన్న పలు ఫర్టిలిటీ కేంద్రాలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వారి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లక్ష్మీరెడ్డి, ఆమె కొడుకు నరేందర్‌రెడ్డిని మరోసారి పోలీస్‌ కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది.


వెలుగులోకి వచ్చిందిలా..

కర్ణాటకకు చెందిన ఓ మహిళ భర్తకు రెండు కిడ్నీలు పాడైన విషయం తెలుసుకున్న లక్ష్మీ రెడ్డి.. సరగసీకి అంగీకరిస్తే చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చింది. అందుకు ఆమె ఒప్పుకోవడంతో మాదాపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించింది. ఆరోగ్యం కుదుటపడ్డాక విషయం తెలుసుకున్న మహిళ భర్త.. ఈ పంచాయితీ అంతా వద్దని, డబ్బులు ఎలాగోలా తిరిగిచ్చేద్దామని భార్యకు నచ్చజెప్పాడు. దీనిపై వారి మధ్య గొడవ జరగడం, విషయం బయటకు పొక్కడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ అవసరాల కోసం అండాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ యువతి, గర్భాల అద్దెకు అంగీకరించిన ఏడుగురు మహిళలు పేద కుటుంబాల వారే కావడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:26 AM