Hyderabad: ఉపాధి ఎర చూపి.. బంధించి వ్యభిచార రొంపిలోకి !
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:58 AM
ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం నగరానికి తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
పేద కుటుంబాల యువతులే ముఠా లక్ష్యం
ఉద్యోగాలు, డబ్బు ఎరతో నమ్మించి మోసం
పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలింపు
హైదరాబాద్‌లో బంధించి వ్యభిచార దందా
9 మందిని రక్షించిన సైబరాబాద్ పోలీసులు
నిర్వాహకులైన 9 మంది ముఠా సభ్యుల అరెస్టు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం నగరానికి తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెర నుంచి 9 మంది యువతులను రక్షించారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేప్టీ వింగ్ డీసీపీ సృజన కరణం గురువారం మీడియాకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. కొంత మంది ముఠాగా ఏర్పడి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉపాధి కల్పిస్తామని, డబ్బులు ఇస్తామంటూ పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నుంచి ఇద్దరు చొప్పున, జార్ఖండ్, హరియాణ, పంజాబ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున, అలాగే ఉజ్బెకిస్థాన్, తుర్కెమిస్థాన్ దేశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది యువతులను ఈ ముఠా అక్రమంగా నగరానికి తీసుకొచ్చింది. వీరిందరినీ మాదాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోనిపర్వత్‌నగర్-గాయత్రీనగర్ ప్రాంతంలో ఉన్న బీఎ్‌సఆర్ సూపర్ లగ్జరీ అండ్ లివింగ్ హోటల్‌లో బంధించింది.
అనంతరం వారిని బెదిరించి వ్యభిచార కార్యకలాపాల్లోకి దింపింది. లోకాంటో, స్కోకా పేర్లతో ఉన్న వెబ్ సైట్‌ల ద్వారా ఈ ముఠా సభ్యులు ప్రచారం చేస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. వెబ్‌సైట్‌లను చూసిన వారు ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా వీరిని సంప్రదిస్తే వారు ఆ హోటల్‌కు పిలిపిస్తున్నారు. అదేవిధంగా నగరంలోని ఇతర హోటల్స్, ఓయో రూమ్‌లను అద్టెకు తీసుకొని ఈ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబరాబాద్ మానవ రవాణా నిరోధక బృందం దాడులు చేసి 9 మంది యువతులను రక్షించింది. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ప్రధాన నిర్వాహకుడైన హ్యమర్‌సింగ్ అలియాస్ అమిద్‌సింగ్‌తో పాటు సూపర్‌వైజర్ తమ్మి శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లు, బెక్‌మెటోవా గుల్‌షాత్, రక్‌మనోవ మాలిక అలియాస్ లోనివ బోర రక్ మనోవ మాలిక, లక్ష్మణ్ తూము, ఆకాశ్ బజాజ్, గోర మహ్మద్ వాసిమ్, పార్తీబన్ కె.పార్తిబన్‌లు ఉన్నారు. నిర్వాహకులపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. అమాయక యువతులను, బాలికలను లక్ష్యంగా చేసుకొని మాయమాటలు చెప్పి తీసుకువస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు.