High Court Support: గర్భిణికి హైకోర్టు అండ
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:59 AM
హైకోర్టు గర్భిణి ప్రవళికకు అండగా నిలిచింది. ఆమె అల్లుడి వేధింపులపై విచారణ చేసి, తల్లీబిడ్డలను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలంటూ ఆదేశించింది
అల్లుడి వేధింపులపై బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్
చిక్కిశల్యమైన బాధితురాలు
వాస్తవాలను గుర్తించాలని లీగల్ సర్వీసెస్ కమిటీకి హైకోర్టు సూచన
కమిటీ నివేదికతో తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించాలని ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తల్లి కడుపులో పిండానికి కూడా జీవించే హక్కును మన రాజ్యాంగం కల్పించింది’’ అంటూ హైకోర్టు ఓ గర్భిణికి అండగా నిలిచింది. ప్రేమపెళ్లి చేసుకుని, హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమార్తెను ఆమె భర్త వేధిస్తున్నాడంటూ ఏపీలోని గుంటూరుకు చెంది న దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై వెంటనే స్పందించింది. గుంటూరులోని చంద్రమౌళినగర్‌కు చెందిన సూరే శ్రీనివాసరావు, వాసవి దంపతుల కుమార్తె ప్రవళిక(27) పెద్దలను ఎదిరించి హైదరాబాద్‌లోని మియాపూర్ మాతృశ్రీనగర్‌లో నివసించే ఎల్.వెంకటాచలపతిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రవళిక 8 నెలల గర్భవతి. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. అల్లుడు సైకోలా వ్యవహరిస్తూ తమ కుమార్తె ను వేధింపులు, చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ శ్రీనివాసరావు, వాసవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించడం లేదని వాపోయారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం వెంటనే స్పందించి.. నిజానిజాలను నిగ్గుతేల్చాలంటూ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీని ఆదేశించారు. దాంతో.. కమిటీ కార్యదర్శి శాంతివర్ధిని స్వయంగా ప్రవళిక ఇంటికి వెళ్లి, పరిశీలించారు. వెంటనే హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. గర్భవతి అయిన ప్రవళిక చాలా బలహీనంగా ఉందని, నరాల సమస్య, రక్తహీనతతో బాధపడుతోందని, ఆమె రెండేళ్ల కుమారుడిలోనూ వయసుకు తగ్గ ఎదుగుదల లేదని ఆ నివేదికలో వెల్లడించారు. దీంతో ధర్మాసనం.. వెంటనే ప్రవళిక, ఆమె కుమారుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి, తగిన వైద్యం అందజేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.