Share News

High Court: నేడు, రేపు కబేళాలు మూసివేయాలన్న ఆదేశాలపై జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:12 AM

స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఫ్‌ షాపులు, కబేళాలు మూసివేయాలన్న ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

High Court: నేడు, రేపు కబేళాలు మూసివేయాలన్న ఆదేశాలపై జోక్యం చేసుకోలేం

  • మాంసం, మద్యం వినియోగంపై నిషేధం లేదు

  • కావాలంటే ముందే తెచ్చుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోండి:హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఫ్‌ షాపులు, కబేళాలు మూసివేయాలన్న ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్‌ మాంసం అమ్మే వ్యక్తి కానందున స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆగస్టు 15, 16న బీఫ్‌ దుకాణాలు, కబేళాలు మూసివేయాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేశారని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌ేసన్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం జీహెచ్‌ఎంసీకి లేదన్నారు.


వ్యాపారం దెబ్బతింటుందని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని పిటిషనర్‌ వ్యాపారి కాదని, వినియోగదారుడు మాత్రమేనని తెలిపింది. అమ్మకాలతో ప్రత్యక్ష సంబంధం అతనికి లేదని పేర్కొంది. ‘మాంసం తినడం, మద్యం సేవించడంపై ఎటువంటి నిషేధం లేదు. మీరు తినాలనుకుంటే, ఇప్పుడే వెళ్లి మీకు కావలసినది కొనుక్కోండి. దానిని డీప్‌ ఫ్రీజర్‌లో భద్రపరచండి. రేపు, ఎల్లుండి దాన్ని ఉపయోగించండి’ అని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ.. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

Updated Date - Aug 15 , 2025 | 05:12 AM