Hyderabad: ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ ఆలయం కూల్చివేతపై వివరణివ్వండి: హైకోర్టు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:03 AM
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12.. ఎమ్మెల్యే కాలనీలో గల పెద్దమ్మ అమ్మవారి ఆలయం కూల్చివేతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12.. ఎమ్మెల్యే కాలనీలో గల పెద్దమ్మ అమ్మవారి ఆలయం కూల్చివేతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీకి, స్థానిక భక్తులకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గత నెల 24 తెల్లవారుజామున 3 గంటలకు జిల్లా కలెక్టర్, షేక్‌పేట తహసీల్దార్, ఇతర అధికారుల ఆధ్వర్యంలో కూల్చేశారని పి.వినోద్ కుమార్ రెడ్డి అనే న్యాయవాది గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టింది. రాత్రికి రాత్రి రహస్యంగా ఆలయ తొలగింపు అక్రమమని పిటిషనర్ ఆరోపించారు. ఆలయ కూల్చివేతపై దర్యాప్తునకు ఆదేశించి, విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయ విచారణకు ఆదేశించి తప్పు చేసిన అధికారులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.