Drug Smuggling: మట్టి గాజులు, డిక్షనరీల చాటున మాదక ద్రవ్యాలు!
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:34 AM
గంజాయి, డ్రగ్స్ రవాణాకు ఆయా ముఠాలు.. సరి కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు, మట్టి గాజుల పార్సిళ్లలో డ్రగ్స్ పెట్టి.. దర్జాగా కొరియర్‌లోనే పంపిస్తున్నాయి.
ఏడాదిలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా
కొరియర్ పార్సిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా తరలింపు
ఢిల్లీలో ఉన్న 10 కొరియర్ కంపెనీలపై ‘ఈగల్’ నిఘా
నైజీరియన్ సూత్రధారి నిక్ కోసం గాలింపు
మహీంద్రా వర్సిటీలో 14మంది విద్యార్థులకు టెస్టులు
ఐదుగురికి పాజిటివ్.. తల్లిదండ్రులకు సమాచారం
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్ రవాణాకు ఆయా ముఠాలు.. సరి కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు, మట్టి గాజుల పార్సిళ్లలో డ్రగ్స్ పెట్టి.. దర్జాగా కొరియర్‌లోనే పంపిస్తున్నాయి. ఎక్కడా లింకులు బయటపడకుండా గుట్టుగా దందా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పది కొరియర్ సంస్థల ద్వారా ఏడాదిలోనే రూ.100కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను దేశవ్యాప్తంగా తరలించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల డ్రగ్స్ దందాను ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్) బృందాలు ఇటీవల బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా పలు సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్నాడు కిచెన్ కేసులో కొరియర్ పార్సిళ్ల ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరుతున్నట్లు గుర్తించిన ఈగల్ బృందాలు.. ఆపై ఢిల్లీలో నిఘా పెట్టగా పది కొరియర్ సంస్థల నుంచి నిక్ అతని అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్‌ను పంపిస్తున్నట్లు తేలింది.

ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీసులను ఈగల్ బృందాలు అప్రమత్తం చేశాయి. ఎండీఎంఏ, కొకైన్, ఓజీ(ఓషన్‌గంజా) కుష్ వంటి మత్తు పదార్థాలను మట్టి గాజులు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల మధ్య పెట్టి కొరియర్ చేసినట్లు ప్రస్తావించాయి. స్మగ్లింగ్‌కు ఢిల్లీలో నివసిస్తున్న నైజీరియన్ సూత్రధారి అని ఈగల్ అధికారులు భావిస్తున్నారు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. కాగా, మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సహా మరో ప్రైవేటు వ్యక్తిని ఇటీవల ఈగల్ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరి వద్ద దొరికిన వివరాల ఆధారంగా యూనివర్సిటీలోని 50మంది విద్యార్థులు తరచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అనుమానిత విద్యార్థులకు కొన్నిరోజులుగా డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా 14మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టు నిర్వహించగా... ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వారి తల్లితండ్రులను పిలిపించి, బాధితులను రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించడానికి ఈగల్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.