Doctor Misconduct Case: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువ వైద్యురాలిపై లైంగిక దాడి
ABN , Publish Date - May 21 , 2025 | 06:10 AM
మహబూబాబాద్‌లోని డాక్టర్ జెర్పుల స్వామి పెళ్లి చేస్తానని నమ్మించి యువ వైద్యురాలిపై బలవంతపు లైంగిక దాడి చేశాడు. బాధితురాలితో ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.

మహబూబాబాద్ వైద్యుడిపై కేసు నమోదు
బంజారాహిల్స్, మే20 (ఆంధ్రజ్యోతి): తనకు బలవంతపు పెళ్లి జరిగిందని, భార్యకు నాలుగు ఆబార్షన్లు కావడంతో ఆమెకు విడాకులిచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నానని ఓ మెడికోను నమ్మించాడు మరో డాక్టర్. ఆ మెడికోను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి లైంగిక దాడి చేశాడు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహాబూబాద్‌లోని అమ్మ ఆస్పత్రిలో పని చేస్తున్న పిల్లల వైద్యుడు డాక్టర్ జెర్పుల స్వామి.. 2023లో అదే పట్టణంలోని ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరిన హైదరాబాద్ నగర వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. గత జనవరి 11న హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ పెడికాన్ సదస్సుకు ఇద్దరూ హాజరయ్యారు. అదే రోజు రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్ హాయత్ హోటల్‌లో గది తీసుకున్నారు. తర్వాత ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేసిన స్వామి.. ఈ సంగతి బయటకు చెప్పొద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన బాధితురాలు విచారించగా, స్వామి తన భార్యకు విడాకులివ్వలేదని తెలిసింది. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ స్వామి, ఆమె తల్లి మాజీ, తండ్రి శంకర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.