Bandi Sanjay: థాయ్‌లాండ్ సైబర్ నేరగాళ్ల వలలో భారత యువత
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:56 AM
ఉద్యోగాల కోసం వెళ్లి థాయ్‌లాండ్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మన దేశానికి చెందిన వందలాది మంది యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వదేశానికి.. మొత్తం 540 మందికి విముక్తి
వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది.. 2 విమానాల్లో తరలింపు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగాల కోసం వెళ్లి థాయ్‌లాండ్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మన దేశానికి చెందిన వందలాది మంది యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 540 మందికి విముక్తి లభించగా, వీరిలో ఏపీ, తెలంగాణలకు చెందినవారు 42 మంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడు ఉద్యోగం కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు మీడియాలో వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్ దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశారు.
దీంతో మయన్మార్ ప్రభుత్వం తన సైన్యాన్ని పంపి సైబర్ మోసాల కేఫ్‌లలో బందీలుగా ఉన్న భారతీయులను రక్షించింది. వీరంతా మయన్మార్‌లోని మేవాడి జిల్లాలో మయన్మార్ సైన్యం పరిరక్షణలో ఉన్నారు. వీరిలో 270 మందితో కూడిన తొలి విమానం థాయ్‌లాండ్‌లోని మై సోట్ పట్టణం నుంచి సోమవారం బయలుదేరింది. మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుంది. బుధవారం మరో 270 మందితో కూడిన విమానం రానుంది. థాయ్‌లాండ్ కేంద్రంగా వీరందరికీ ఉద్యోగాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు స్థానిక ఏజెంట్ల ద్వారా ఆశ చూపారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఖరారయ్యాయని నమ్మబలికిన ఏజెంట్లు బాధితులను థాయ్‌లాండ్‌తో పాటు కంబోడియా, లావోస్, మయన్మార్‌లలోని పలు సైబర్ మోసాల కేఫ్‌లలో విక్రయించారు. సైబర్ నేరగాళ్లు అక్కడ వారి చేత బలవంతంగా ఆన్‌లైన్ నేరాలు చేయిస్తున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు చేయకపోతే కరెంట్ షాక్ ఇచ్చి హింసిస్తారని కేంద్రమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.