Share News

Hospitals: 55 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు నోటీసులు

ABN , Publish Date - May 31 , 2025 | 05:13 AM

ఆస్పత్రుల్లో రోగులకు భోజనం అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందన్న విజిలెన్స్‌ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

Hospitals: 55 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు నోటీసులు

  • నిబంధనలు పాటించని కాంట్రాక్టర్ల తొలగింపు

  • విజిలెన్స్‌ నివేదికపై చర్యలకు రంగం సిద్ధం

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో రోగులకు భోజనం అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందన్న విజిలెన్స్‌ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. కాంట్రాక్టర్లపైనా చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వాస్పత్రుల్లోని రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారని, డైట్‌ మెనూ పాటించడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. దీనిపై సర్కారు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆ నివేదిక సర్కారు అందింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది.


మొత్తం 55 మంది ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఇందులో తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని 40ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌.. వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 15 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ నరేంద్రకుమార్‌షోకాజ్‌ నోటీసులిచ్చారు. మెనూ పాటించని, రోజూ ఒకే తరహా భోజనం పెట్టేవారిని, పరిశుభ్రత పాటించని కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించాలని కలెక్టర్లను వైద్య శాఖ ఆదేశించింది. ఆస్పత్రుల్లో వెంటనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Updated Date - May 31 , 2025 | 05:13 AM