High Court: టైటిల్ నిర్ధారించే అధికారం తహసీల్దార్‌కు లేదు
ABN , Publish Date - May 31 , 2025 | 05:15 AM
ఎలాంటి నిబంధనలను ప్రస్తావించకుండా, భూమిపై టైటిల్‌ను నిర్ణయించే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
నిబంధనల్లేకుండా ప్రభుత్వ భూమిగా ప్రకటించలేరు: హైకోర్టు
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి నిబంధనలను ప్రస్తావించకుండా, భూమిపై టైటిల్‌ను నిర్ణయించే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో ఓల్డ్ సర్వే 380 నెంబర్‌లోని దాదాపు 5 ఎకరాల తోళ్ల కార్ఖానా భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ 2019లో తహసీల్దార్ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించడం చెల్లదని పేర్కొంటూ మహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన 40మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలు విన్న ధర్మాసనం.. ఏ అధికారం ద్వారా తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రశ్నించింది. ఒకవేళ పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే భూదురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రెవెన్యూ రికార్డులు, ఎంట్రీలు భూమిపై ఎలాంటి హక్కును నిర్ధారించలేవని, ఆఅధికారం తహసీల్దార్‌కు లేదని పేర్కొంది. ప్రభుత్వ భూమి అటూ తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.