Helicopter Ride: సరస్వతి పుష్కరాల్లో ‘జాయ్ రైడ్’
ABN , Publish Date - May 06 , 2025 | 06:15 AM
రాష్ట్రంలో మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది.
హెలికాప్టర్ నుంచి పుష్కరాలను వీక్షించేలా ఏర్పాటు
ఒక్కొక్కరికి రూ.4500 టికెట్.. 6-7 నిమిషాల ప్రయాణం
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టూ ఉన్న పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్రప్రభుత్వం ‘జాయ్‌రైడ్’ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఒకేసారి 6 గురు ప్రయాణించేందుకు వీలుగా ఎయిర్‌బస్ హెచ్-125 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనుంది. టికెట్ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేయగా.. ప్రయాణ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు. హెలికాప్టర్ ప్రయాణాలకు అవసరమైన సాంకేతిక అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకే జాయ్‌రైడ్‌లను నిర్వహించనున్నారు. కాగా, ఈ హెలికాప్టర్ ప్రయాణాల బాఽధ్యతలను బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. జాయ్‌రైడ్‌లకు అవసరమైన సాంకేతిక అనుమతులను సదరు సంస్థే ఏర్పాటు చేసుకుంటుంది.
పుష్కర ఘాట్‌లకు దగ్గర్లోనే హెలికాప్టర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, పర్యాటకశాఖలతో పాటు సివిల్ ఏవియేషన్ విభాగం సంయుక్తంగా హెలికాప్టర్ ప్రయాణాలను పర్యవేక్షించనున్నాయి. గతంలో మేడారం జాతరలోనూ దేవాదాయశాఖ హెలికాప్టర్ ప్రయాణాలను ఏర్పాటు చేసింది. అప్పుడు భక్తుల నుంచి మంచి ఆదరణ రావడంతో సరస్వతి పుష్కరాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, బెంగళూరు నుంచి కాళేశ్వరానికి మళ్లీ ఇక్కడి నుంచి అక్కడకు హెలికాప్టర్ ఖాళీగా వచ్చి, వెళ్లాల్సిన నేపథ్యంలో రూ.20లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా హెలిప్యాడ్‌కు దగ్గర్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలను అందుబాటులో ఉంచనుంది. హెలికాప్టర్ ప్రయాణ బాధ్యతలను తీసుకున్న సంస్థ గతంలో 15 వేల మంది భక్తులకు జాయ్‌రైడ్‌లను అందించిందని వెల్లడించింది. టికెట్ల బుకింగ్ కోసం టోల్ ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.