Share News

Telangana Heatwave: వడదెబ్బతో 9మంది మృతి

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:21 AM

వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి, రానున్న రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Telangana Heatwave: వడదెబ్బతో 9మంది మృతి

  • భానుడి భగభగలతో మండుతున్న రాష్ట్రం

  • కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గరిష్ఠంగా 44,

  • మరో 3 జిల్లాల్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

  • సాయంత్రం.. కొన్ని జిల్లాల్లో వర్షం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలోనే వడదెబ్బ తగిలి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో 43.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో 43.4, మంచిర్యాలలో 42.8, సిరిసిల్ల జిల్లాలో 42.2, మెదక్‌ జిల్లాలో 42.2, ఖమ్మం జిల్లాలో 41.5 డిగ్రీల మేర ఉష్ణోగత్రలు రికార్డయ్యాయి. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భయపెట్టగా.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు, మూడు మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.


dsxz.jpg

వడదెబ్బ మృతులు వీరే..

  • నిర్మల్‌లోని కురన్నపేట్‌కు చెందిన నిగులపు శంకర్‌(45), నిగులపు రాజు(40).. కుల వృత్తిలో భాగంగా ఆదివారం పోచమ్మ ఆలయం వద్ద డప్పు కొట్టేందుకు వెళ్లారు. రోజంతా ఎండలో ఉండడంతో సాయంత్రం ఇంటికి వచ్చాక అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందారు.

  • ఆదిలాబాద్‌ జిల్లా బీంపూర్‌లో ఉపాధి పనులకు వెళ్లిన కూలీ చహాన్‌ కేశవ్‌ (60) వడదెబ్బ తగలడంతో అపస్మారక స్థితికి చేరాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

  • భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లికి చెందిన దూడపాక ప్రభాకర్‌(48) ఆదివారం పొలం వద్దకు వెళ్లాడు. ఎండల దాటికి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జమ్మికుంటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

  • మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో మహిళా రైతు హనుమాండ్ల ప్రేమలతరెడ్డి (58).. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరపోశారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న ఆమె.. ఎండల తీవ్రతతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి.. ఆమె భర్త వెంకట్రాంరెడ్డిని ఓదార్చారు. ఇది ప్రభుత్వ హత్యేనని ధ్వజమెత్తారు.


  • వరంగల్‌ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గీసగోని శ్రీదేవి (36) ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లింది. అక్కడ అస్వస్థతకు గురైన ఆమెను మహిళలు వెంటనే ఇంటికి తీసుకవెళ్లారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి మృతి చెందింది.

  • ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు వెళ్లగా.. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. రత్తయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన వృద్ధురాలు లావుడ్య లక్ష్మి ఓ రేకుల షెడ్డులో ఒంటరిగా నివసిస్తోంది. ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.

  • కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లికి చెందిన ఉడిగే ఐలమ్మ(55) వ్యవసాయ పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు వడదెబ్బ తాకడంతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందింది.


ఈదురుగాలుల బీభత్సం

వికారాబాద్‌ జిల్లాలో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి వికారాబాద్‌ నుంచి సదాశివపేటకు వెళ్లే మెయిన్‌ రోడ్డు, దోమ-పాలేపల్లి రోడ్డుపై భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. నవాబ్‌పేట మండలం మమ్మదాన్‌పల్లి సమీపంలో భారీ చెట్టు రైల్వే ట్రాక్‌పై పడగా.. రైల్వే అధికారులు అప్రమత్తమై తొలగించారు. శంకర్‌పల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి హోర్డింగ్‌ నేలకొరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్‌ యార్డులో ధాన్యం తడిసిపోయింది. తిమ్మాపూర్‌, దౌలాపూర్‌లో మామిడికాయలు నేలరాలాయి. నారాయణపేటలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. మార్కెట్‌ యార్డులో 500బస్తాల ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధమైంది. కరీంనగర్‌ జిల్లా చింతపల్లిలోని కవిత కాటన్‌ ఇండస్ట్రీస్‌ నుంచి 24టన్నుల పత్తిని లోడు చేసుకుని తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారుగా రూ.80లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

Updated Date - Apr 22 , 2025 | 04:21 AM