High Court: మైనర్ 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించిన హైకోర్టు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:30 AM
ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ చట్టం-2021 ప్రకారం మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి తన కుమార్తె కవల గర్భాన్ని తొలగించేలా నిలోఫర్ ఆస్పత్రి మెడికల్ సూపరిటెండెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని నిలోఫర్ ఆస్పత్రి మెడికల్ సూపరిటెండెంట్‌ను గతంలోనే ఆదేశించింది. తాజాగా సదరు నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించడం క్షేమకరం కాదన్న వైద్యనిపుణుల అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. గర్భాన్ని తొలగించేలా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది.