Telangana High Court: మూడో బిడ్డకు ప్రసూతి సెలవు ఎందుకివ్వకూడదు? :హైకోర్టు
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:44 AM
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రసూతి సెలవు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రసూతి సెలవు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసూతి సెలవును ఇద్దరు బిడ్డల వరకే పరిమితం చేస్తూ ఉమ్మడి ఏపీలో 2010లో జారీచేసిన జీవో 152ను సవాల్ చేస్తూ సరూర్‌నగర్ మండలం రాజీవ్‌గాంధీనగర్ జెడ్పీహెచ్‌ఎ్‌సకు చెందిన స్కూల్ అసిస్టెంట్ జి.శ్వేత హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైౖ చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహిముద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఉమ్మడి ఏపీలో జారీచేసిన ఈ జీవో ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉందని చెప్పారు.
ఇద్దరు పిల్లల వరకే 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇచ్చేందుకు అనుమతి ఉందని తెలిపారు. ఆ జీవోను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సవరించారని, ఇద్దరు పిల్లల వరకు ఉన్న పరిమితిని ఎత్తివేశారని పేర్కొన్నారు. తెలంగాణలో సైతం ఆ జీవోను సవరించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ తెలియజేయాలని పేర్కొంటూ విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.