Share News

Kaleshwaram Project: పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక మీకు ఎక్కడిది?

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:02 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక మీ చేతికి ఎలా వచ్చింది ? అంటూ నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషిని హైకోర్టు ప్రశ్నించింది.

Kaleshwaram Project: పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక మీకు ఎక్కడిది?

  • రిపోర్ట్‌ను కొట్టేయాలని పిటిషన్‌ వేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఎస్కే జోషీకి హైకోర్టు ప్రశ్న

  • కమిషన్‌ నివేదికను ఎక్కడా అప్‌లోడ్‌ చేయలేదు : ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక మీ చేతికి ఎలా వచ్చింది ? అంటూ నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషిని హైకోర్టు ప్రశ్నించింది. సాక్షిగా మాత్రమే పిలిచి, చట్టప్రకారం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనకు వ్యతిరేకంగా ఫైండింగ్స్‌ ఇవ్వడం చెల్లదని, ఘోష్‌ కమిషన్‌ నివేదికను కొట్టేయాలంటూ జోషి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారించింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని ఎస్కే జోషీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం.. అసలు కమిషన్‌ నివేదిక మీ చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ న్యాయవాది బదులిస్తూ.. పబ్లిక్‌ డొమైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు మంత్రులు నిర్వహించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో రిపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీ విడుదల చేశారని పేర్కొన్నారు.


నివేదికను అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారని.. ఈ నేపథ్యంలోనే డౌన్‌లోడ్‌ చేసుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెడితే కేవలం ఎమ్మెల్యేల వద్దే ఉంటుందని.. అది బయట కు ఎలావచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వ వెబ్‌సైట్లు, పబ్లిక్‌ డొమైన్‌లో నివేదిక సారాంశం ఉంటే తొలగించాలని ఇప్పటికే ఆదేశించామని, అయినా మీరెలా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు? నివేదిక ఎక్కడి నుంచి వచ్చిందో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయండి’’ అని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు, ఘోష్‌ కమిషన్‌ నివేదికను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని, కావాలంటే లిఖిత పూర్వక వివరణ ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ ప్రభావితవ్యక్తి అవునా?కాదా? ముందు తెలియాలని వ్యాఖ్యానించింది. సరైన విధానంలో కమిషన్‌ రిపోర్ట్‌ అందకుండా పిటిషనర్‌ బాధిత వ్యక్తి అని ఎలా తేలుస్తామని ప్రశ్నించింది. కమిషన్‌ నివేదికను ఎక్కడ అప్‌లోడ్‌ చేశారో తెలపండని ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను 10కి వాయిదా వేసింది.

Updated Date - Sep 04 , 2025 | 05:02 AM