Share News

High Court: ఖాజాగూడ టవర్ల నిర్మాణంపై బిల్డర్లకు నోటీసులు

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:33 AM

ఖాజాగూడ చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ టవర్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సోమవారం హైకోర్టు ప్రైవేటు పార్టీలకు నోటీసులు ఇచ్చింది.

High Court: ఖాజాగూడ టవర్ల నిర్మాణంపై బిల్డర్లకు నోటీసులు

  • ప్రభుత్వ భూముల కబ్జాపై వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఖాజాగూడ చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ టవర్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సోమవారం హైకోర్టు ప్రైవేటు పార్టీలకు నోటీసులు ఇచ్చింది. టవర్లు నిర్మిస్తున్న సోహిని బిల్డర్స్‌, బెవర్లీహిల్స్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ సహా పలువురు ప్రైవేటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), యెన్నం శ్రీనివా్‌సరెడ్డి (మహబూబ్‌నగర్‌), మురళీనాయక్‌ భూక్యా (మహబూబాబాద్‌), కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ నోటీసులు జారీ చేసింది.


ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. సర్వే నెంబర్లు, లొకేషన్‌ వివరాలతో మళ్లీ ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆ మేరకు అన్ని వివరాలు సమర్పించడంతో ప్రైవేటుపార్టీలకు నోటీసులు పంపించింది. ప్రైవేటు ప్రతివాదులకు వ్యక్తిగతంగా నోటీసు అందజేయడానికి పిటిషనర్ల న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌కు అనుమతి ఇచ్చింది. నోటీసు ఇచ్చినట్లు ఆధారాలను కోర్టుకు రెండు వారాల్లో సమర్పించాలని ఆ న్యాయవాదిని ఆదేశించింది.విచారణ రెండువారాలకు వాయిదాపడింది.

Updated Date - Jul 08 , 2025 | 04:33 AM