Ponguleti Srinivasa Reddy: అబద్దాన్ని నిజం చేసేందుకు హరీశ్ తాపత్రయం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:53 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలను నిజం చేయడానికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మామ కళ్లలో ఆనందం కోసం పాట్లు: మంత్రి పొంగులేటి
కూసుమంచి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలను నిజం చేయడానికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే కర్త, కర్మ, క్రియ అని మాజీ సీఎం కేసీఆర్ పేరు 33 సార్లు, మామ కళ్లలో ఆనందం చూసేందుకు తాపత్రయ పడ్డ హరీశ్‌రావు పేరు 20 సార్లు కమిషన్ నివేదికలో ప్రస్తావించారన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోనిమంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కమిషన్ నివేదిక వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నేతలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వారు అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఉందని, కేంద్రం నుంచి 11 అనుమతులున్నాయని చెబుతున్నవని అబద్ధాలేనన్న పొంగులేటి.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని, అధికారంలోకి వస్తే అవకతవకలపై విచారిస్తామని చెప్పామని గుర్తు చేశారు. జస్టిస్ ఘోష్ నివేదికపై సీనియర్ ఐఏఎ్‌సల కమిటీ ఇచ్చిన ముఖ్యాంశాలను అసెంబ్లీలో పెట్టి పూర్తిస్థాయిలో చర్చించడంతోపాటు రాష్ట్ర, దేశ ప్రజలకు తెలియజేస్తామని పొంగులేటి అన్నారు. అసెంబ్లీలో విపక్ష పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని.. అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.