Share News

Harish Rao: అడ్డంగా దొరికిన రేవంత్‌

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:48 AM

బనకచర్ల విషయంలో బుకాయించి సీఎం రేవంత్‌రెడ్డి నగ్నంగా దొరికిపోయాడని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. బనకచర్ల అంశమే అజెండాలో ఉన్నట్లు ఏపీ మంత్రి వెల్లడించడమే కాకుండా.. కేంద్రం పరిధిలోని ఆకాశవాణి రేడియోలోనూ ప్రసారమైందని చెప్పారు.

Harish Rao: అడ్డంగా దొరికిన రేవంత్‌

  • బనకచర్ల అంశమే అజెండా అని ఆకాశవాణి రేడియో కూడా చెప్పింది: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల విషయంలో బుకాయించి సీఎం రేవంత్‌రెడ్డి నగ్నంగా దొరికిపోయాడని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. బనకచర్ల అంశమే అజెండాలో ఉన్నట్లు ఏపీ మంత్రి వెల్లడించడమే కాకుండా.. కేంద్రం పరిధిలోని ఆకాశవాణి రేడియోలోనూ ప్రసారమైందని చెప్పారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 763 టీఎంసీల నీళ్ల కోసం కొట్లాడుతూ.. 500 టీఎంసీలు చాలనడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌ చిట్‌చాట్‌ చేశారు. ఏపీతో తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు, బనకచర్ల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే రేవంత్‌ కేటీఆర్‌పై విమర్శలకు దిగారన్నారు. డ్రగ్స్‌, గంజాయి అంటూ మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అర్ధరాత్రి ఏపీ మంత్రి లోకేశ్‌ను కేటీఆర్‌ కలిశారని సీఎం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు.


ఆయనలా దొంగచాటుగా అర్ధరాత్రి కార్లలో తిరిగే అలవాటు మాకు లేదు. రేవంత్‌.. కంపల్సివ్‌ లయింగ్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధితో బాధ పడుతున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా తెలియని సీఎం ఉండటం తెలంగాణకు పట్టిన దురదృష్టం’ అని దుయ్యబట్టారు. ‘ఎత్తు ఎక్కువంటూ నన్ను విమర్శిస్తున్న నువ్వు.. ఎన్నటికీ.. నా అంత ఎత్తు పెరగలేవు. ఎన్ని చేసినా కేసీఆర్‌ స్థాయికి రాలేవ్‌..!’ అని రేవంత్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవడో దుబాయ్‌లో చనిపోతే కేటీఆర్‌కేం సంబంధం? అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థతో తమపై నిఘా పెట్టిన రేవంత్‌రెడ్డి.. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేస్తున్నారన్నారు. అందుకే ఢిల్లీలో ఓ విలేకరిని పట్టుకొని హరీశ్‌రావుతో రోజూ ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావంటూ.. బెదిరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Updated Date - Jul 18 , 2025 | 03:48 AM